సీఎం జగన్ నన్ను పశుపతి అన్నారు... ఆ మాట నేను అంగీకరిస్తున్నా... ఎందుకంటే...!: చంద్రబాబు

  • కోనసీమ జిల్లా రావులపాలెంలో చంద్రబాబు ప్రజాగళం సభ
  • పశుపతి అంటే శివుడు అని వెల్లడించిన చంద్రబాబు
  • శివుడు ప్రపంచాన్నే రక్షిస్తుంటాడని వివరణ
టీడీపీ అధినేత చంద్రబాబు ఈ సాయంత్రం కోనసీమ జిల్లా రావులపాలెంలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ప్రశాంతతకు మారుపేరు కోనసీమ అని, గతంలో ఎప్పుడైనా ఇక్కడ హింస జరిగిందా? అని ప్రశ్నించారు. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకాలు జరుగుతున్నాయని, కబ్జాలు, దాడులు, హత్యలు, అక్రమ అరెస్టులతో ఏపీలో అస్తవ్యస్తంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

రాష్ట్రం మళ్లీ నిలబడాలి, రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలన్న ఉద్దేశంతో మేం ముగ్గురం కలిసి మీ ముందుకు వచ్చాం అని చంద్రబాబు పొత్తుల గురించి మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కూటమిదే గెలుపు అని, నూటికి నూరు శాతం మనమే గెలుస్తున్నాం అని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీని ఓడించి బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

ఆ మాట విని నవ్వుకున్నా

సీఎం జగన్ మదనపల్లె సభలో తనపై చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు ప్రస్తావించారు. నిన్న సీఎం జగన్ తనను పశుపతి అన్నాడని, ఆ మాట విని నవ్వుకున్నానని తెలిపారు. తనను పశుపతి అనడం పట్ల తానేమీ ఆశ్చర్యపోలేదని, పశుపతి అంటే ప్రపంచాన్ని రక్షించే శివుడు అని వివరించారు. అందుకే తాను శివ అవతారం ఎత్తాను అని చంద్రబాబు పేర్కొన్నారు. 

"నన్ను పశుపతి అనడాన్ని అంగీకరిస్తున్నా... ప్రపంచాన్ని రక్షించడానికి ఆ శివుడు విషాన్ని కూడా గొంతులో పెట్టుకున్నాడు. ఐదేళ్లుగా మీరు చూస్తున్నారు... నన్ను అనేక మాటలు అన్నారు, మిత్రుడు పవన్ కల్యాణ్ ను అడుగడుగునా ఇబ్బందులు పెట్టారు. అవన్నీ భరించాను, ఎన్నో అవమానాలు పడ్డాను. కానీ ఒకే పట్టుదల, ఒకే ఆలోచన... మళ్లీ తెలుగుజాతిని కాపాడుకోవాలి. ప్రజలను చైతన్యపరిచేందుకు తాను ప్రజాగళం చేపడితే, ప్రజల్లో కనిపిస్తున్న ఉత్సాహం చూసి నేనే చైతన్యవంతుడ్ని అవుతున్నా" అని చంద్రబాబు పేర్కొన్నారు.

జగన్ ఎన్నికల ముందు ఏం చెప్పాడు?

మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓటు అడుగుతానని చెప్పావు. కానీ జనాలను మోసం చేశావు. నాణ్యత లేని బ్రాండ్లు తీసుకువచ్చి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నావు. రూ.60 క్వార్టర్ బాటిల్ ఇవాళ రూ.200 పలుకుతోంది. రూ.140 ఎవరి జేబులోకి పోతోంది? మద్యం తయారుచేసేది వీళ్లే, సరఫరా చేసేది వీళ్లే, అమ్మేది వీళ్లే, డబ్బులు కూడా వీళ్లకే. మళ్లా మద్య నిషేధం అని చెప్పి ఓట్లు పొందాలనే కుట్ర రాజకీయం కూడా వీళ్లదే. 

ఆకాశంలో ఆయన వస్తే కింద ఉన్న చెట్లు కొట్టేస్తారు

ఐదేళ్ల తర్వాత జనాల్లోకి వస్తున్నాడు. మొన్నటిదాకా ఆకాశంలో ఈయన వస్తే కింద ఉన్న చెట్లు కొట్టేసేవారు. మోసపూరితమైన మాటలు చెబుతూ, అది చేస్తా, ఇది చేస్తా అంటున్నాడు. ప్రజలు అతడ్ని అడుగడుగునా నిలదీయాలి. మద్యపాన నిషేధం తర్వాతే ఓటు అడుగుతానని చెప్పారు... చేశారా? అని మీరు అడగాలి. ఇప్పుడు రాష్ట్రంలో గంజాయి వచ్చింది. ఎక్కడ చూసినా గంజాయే. కొత్తగా విశాఖ పోర్టుకు 25 వేల కిలోల డ్రగ్స్ వచ్చాయి. వైసీపీ నేతలు మీ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు.

బాబాయ్ ని గొడ్డలిపోటుతో చంపి సానుభూతితో గెలిచాడు

గత ఎన్నికల సమయంలో బాబాయ్ ని గొడ్డలి పోటుతో చంపి సానుభూతితో గెలిచిన వ్యక్తి ఈ జగన్ మోహన్ రెడ్డి. ఇప్పుడు వాళ్ల చెల్లెలే చెబుతోంది... నన్ను ఎంపీగా పెట్టమని చిన్నాన్న చెబితే, చిన్నాన్నను చంపేశారని ఆమె వెల్లడించింది. గొడ్డలితో బాబాయ్ ని లేపేసే వ్యక్తులకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత ఉందా? కోడికత్తి డ్రామాలు ఆడేవాళ్లు అవసరమా? 

నిన్ననే కొత్త డ్రామాకు తెరలేపారు!

నిన్ననే చూశాం. పెన్షన్ల పేరిట కొత్త డ్రామాకు తెరలేపారు. ఎప్పటినుంచో పేదలు, వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు ఇవ్వడం జరుగుతోంది. ఎవరు ప్రారంభించారు ఈ పెన్షన్లు? మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు రూ.35తో పెన్షన్లు ప్రారంభించారు. రూ.200గా ఉన్న పెన్షన్ ను 2014లో నేను ముఖ్యమంత్రిని అయ్యాక రూ.2 వేలు చేశాం. ఇప్పుడు ఈయన వచ్చాక ముక్కుతూ మూలుగుతూ వెయ్యి రూపాయలు పెంచాడు. పెంచుకుంటూ పోతానని రూ.250 పెంచుతూ వచ్చాడు. ఇప్పుడది రూ.3 వేలు అయ్యేసరికి ఈయన పోతున్నాడు. నేను గత ఎన్నికల్లో గెలిచి ఉంటే మొదటి నెలే రూ.3 వేలు ఇచ్చేవాడ్ని. ఇప్పుడు రూ.4 వేలు ఇస్తాం.  

అధికార పార్టీ ఓట్ల కోసం పెన్షన్లపై నీచ రాజకీయాలు చేస్తోంది

ఏపీలో ఓట్ల కోసం అధికార పార్టీ దిగజారిపోయింది. పెన్షన్లపై నీచ రాజకీయాలు చేస్తోంది. వాలంటీర్ వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు. వాలంటీర్లు తటస్థంగా ఉండాలని కోరుతున్నాం. రేపు వచ్చేది ఎన్డీయే ప్రభుత్వం. మీకు కూడా న్యాయం చేస్తాం. వాలంటీర్లలో బాగా చదువుకున్నవారు ఉన్నారు... రూ.5 వేలు కాదు, వారు రూ.50 వేలు సంపాదించుకునే మార్గం నేను చూపిస్తాను. 

వాలంటీర్లను రెచ్చగొట్టి రాజీనామాలు చేయించి, వారిని వైసీపీ కార్యకర్తలుగా తయారుచేస్తున్నారు. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కారు, పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులే పెన్షన్లు పంపిణీ చేయాలని ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా చెప్పింది. సచివాలయ ఉద్యోగుల సాయంతో రెండ్రోజుల్లోనే అందరికీ పెన్షన్లు పంపిణీ చేయొచ్చు... ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు ఇవ్వొచ్చు. కానీ, కోడికత్తి డ్రామా కమలహాసన్ చేసిన పని మీరందరూ చూశారు. 

ఈయనకు సానుభూతి కావాలి. బాబాయ్ ని చంపి సానుభూతి తెచ్చుకుని 2019 ఎన్నికల్లో ఓట్లు తెచ్చుకున్నాడు. అదే సమయంలో కోడికత్తి డ్రామా ఆడాడు. ఈయనను కోడికత్తితో చంపేస్తారట. ఆ డ్రామాతో కూడా ఓట్లు సంపాదించాడు. ఇప్పుడు వృద్ధులను కూడా చంపేసి, మా వల్లే చనిపోయారని డ్రామాలు ఆడాలనుకుంటున్నావా కోడికత్తి కమలహాసన్? 

రాష్ట్ర సీఎస్ కు బాధ్యత లేదా అని అడుగుతున్నా. వారు డ్రామాలు ఆడుతుంటే మీరు కూడా సహకరిస్తారా? అధికార యంత్రాంగం ఉంది... ఒక్క నెల మీరు ఇంటి వద్దే పెన్షన్లు ఇవ్వలేరా? ఇవ్వలేనంత అసమర్థులా మీరు?... అంటూ  చంద్రబాబు ధ్వజమెత్తారు.


More Telugu News