నా సినిమా రిలీజైతే థియేటర్ల వద్ద రెవెన్యూ ఉద్యోగులను నియమిస్తారు... ఇంటి వద్దే పెన్షన్లు ఇవ్వలేరా?: పవన్ కల్యాణ్

  • ఏపీలో నేటి నుంచి పెన్షన్ల అందజేత
  • వృద్ధులను మంచాలపై సచివాలయాలకు మోసుకువస్తున్న వైనం
  • ఇళ్ల వద్దే పెన్షన్లు అందించడానికి ఏంటి ఇబ్బంది? అని సూటిగా ప్రశ్నించిన పవన్
ఏపీలో ఇవాళ్టి నుంచి పెన్షన్లు అందిస్తుండగా, సచివాలయాలకు వృద్ధులను మంచాలపై మోసుకువస్తున్న ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై పవన్ కల్యాణ్ స్పందించారు. ఏపీ చీఫ్ సెక్రటరీ గారూ... వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇళ్ల వద్దే పెన్షన్లు అందించడానికి ఉన్న ఇబ్బంది ఏమిటి? అని సూటిగా ప్రశ్నించారు. 

"పవన్ కల్యాణ్ సినిమా రిలీజ్ అయితే థియేటర్ల వద్ద రెవెన్యూ ఉద్యోగులకు డ్యూటీలు వేస్తారు. తహసీల్దార్ నెంబర్లు ఇస్తారు. మరి అదే ఉద్యోగులను పెన్షన్లు ఇవ్వడానికి వినియోగించుకోలేరా? పెన్షన్లు ఇవ్వడానికి ఉద్యోగులే లేరా? కరోనా కాలంలో మద్యం షాపుల వద్ద ఉద్యోగులకు డ్యూటీలు వేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, గ్రామ రెవెన్యూ యంత్రాంగం ద్వారా పెన్షన్లను ఇళ్ల వద్దే ఇవ్వొచ్చు. వైసీపీ నాయకులు చేసే మెలో డ్రామాలకు, బ్లేమ్ గేమ్స్ కు ప్రభుత్వ నిర్ణయాలు బలం ఇస్తున్నాయి" అని పవన్ ట్వీట్ చేశారు. 

అంతేకాదు, భీమ్లానాయక్ సినిమా రిలీజ్ సమయంలో థియేటర్ల వద్ద ఉద్యోగులను నియమిస్తూ వెలువడిన ఉత్తర్వుల ప్రతిని కూడా పవన్ కల్యాణ్ పంచుకున్నారు.


More Telugu News