కేన్సర్​ బారిన పడ్డ బిహార్​ బీజేపీ నేత సుశీల్​ కుమార్​ మోదీ

  • కొంతకాలంగా ఈ వ్యాధితో పోరాడుతున్నట్లు వెల్లడి
  • సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రకటన
  • ఆయన కోలుకోవాలని పలువురు నేతల ఆకాంక్ష
బీజేపీ సీనియర్‌ నేత, బిహార్‌ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్‌ కుమార్‌ మోదీ కేన్సర్‌ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా బుధవారం ప్రకటించారు. కొంతకాలంగా ఈ వ్యాధితో పోరాడుతున్నానని చెప్పారు. అనారోగ్యం దృష్ట్యా ఎన్నికల ప్రక్రియలో భాగం కాలేకపోతున్నట్లు తెలిపారు.

‘ఎక్స్’ వేదికగా ప్రకటన..
‘‘గత 6 నెలలుగా కేన్సర్‌ తో పోరాడుతున్నా. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పేందుకు ఇదే సరైన సమయమని అనుకుంటున్నా. లోక్‌సభ ఎన్నికల్లో నేనేమీ ప్రచారం చేయలేను. ప్రధానికి ఈ విషయం చెప్పా. ఈ దేశం, బిహార్‌, పార్టీకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటా. నా జీవితం ప్రజా సేవకు అంకితం’’ అని సుశీల్ మోదీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఈ పోస్ట్‌పై పలువురు రాజకీయ నేతలు స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

రెండుసార్లు డిప్యూటీ సీఎంగా..
72 ఏళ్ల సుశీల్‌ కుమార్‌ బిహార్‌ రాజకీయాల్లో సీనియర్‌ నేత. 2005 నుంచి 2020 మధ్య సీఎం నీతీశ్‌ కుమార్‌ ప్రభుత్వంలో రెండు దఫాలుగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. 2020లో ఎల్జేపీ వ్యవస్థాపకుడు రామ్‌ విలాస్‌ పాశ్వాన్ మరణంతో ఆయన రాజ్యసభ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో ఉప ఎన్నికల్లో ఆ సీటుకు సుశీల్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 2న ఆయన పదవీకాలం ముగిసింది.

రెండోసారి టిక్కెట్ కు బీజేపీ నో
ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆయనకు రెండోసారి టికెట్‌ ఇచ్చేందుకు బీజేపీ హైకమాండ్‌ నిరాకరించింది. ఈ క్రమంలోనే ఆయన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఆయనకు టికెట్‌ లభించలేదు. మరోవైపు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో ఏర్పాటైన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీలో సుశీల్‌ సభ్యుడిగా ఉన్నారు. కానీ తాజా పోస్ట్‌ నేపథ్యంలో ఆయన ఈ కమిటీ వ్యవహారాల నుంచి కూడా వైదొలగనున్నట్లు తెలుస్తోంది.


More Telugu News