2024లో భారత వృద్ధి రేటు 7.5 శాతం.. వరల్డ్ బ్యాంక్ అంచనా

  • సేవలు, పారిశ్రామికరంగంలో కార్యకలాపాల జోరు వృద్ధికి ఊతమిస్తుందని విశ్లేషణ
  • 2025లో 6.6 శాతం వృద్ధి నమోదవ్వొచ్చని అంచనా
  • దక్షిణాసియా దేశాల ఆర్థిక వృద్ధి అంచనాలను సవరించిన వరల్డ్ బ్యాంక్
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంక్ సవరించింది. 2024లో 6.3 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా వేసిన వరల్డ్ బ్యాంక్ ప్రస్తుతం దానిని 7.5 శాతానికి పెంచింది. సేవలు, పారిశ్రామిక రంగంలో కార్యకలాపాలు దృఢంగా ఊపందుకోవడంతో ఆర్థిక వృద్ధి రేటు 1.2 శాతం నుంచి 7.5 శాతం మధ్య నమోదవ్వొచ్చని పేర్కొంది. ఈ మేరకు దక్షిణాసియాకు సంబంధించి సవరించిన అంచనాల రిపోర్టును బుధవారం వెలువరించింది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరం 2023-24లో మూడవ త్రైమాసికంలో జీడీపీ 8.4 శాతం మేర నమోదయింది. ఇక జనవరి-మార్చి త్రైమాసికంలో 8 శాతం వృద్ధి రేటు నమోదవ్వొచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విశ్వాసం వ్యక్తం చేసిన నేపథ్యంలో వరల్డ్ బ్యాంక్ తాజా అంచనాలు వెలువడ్డాయి. అయితే వచ్చే ఏడాది 2025లో వృద్ధి రేటు 6.6 శాతానికే పరిమితం కావొచ్చని విశ్లేషించింది.

క్రమంగా ద్రవ్యలోటు తగ్గనుందని, ప్రభుత్వ రుణాలు తగ్గుతాయని వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది. ఆర్థిక పురోగతి కోసం కేంద్ర ప్రభుత్వం చేసే ప్రయత్నాలకు వృద్ధి రేటు ప్రోత్సాహకరంగా ఉంటుందని అభిప్రాయపడింది. కాగా దక్షిణాసియాలో మెరుగైన ఆర్థిక వృద్ధి రేటు నమోదవనుందని పేర్కొంది. ఇందుకు భారత్ సాధించే పురోగతి ప్రధాన కారణమని విశ్లేషించింది. రానున్న 2 సంవత్సరాల్లో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా దక్షిణాసియా నిలుస్తుందని వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ అంచనా వేసింది. భారత పొరుగుదేశాల విషయానికి వస్తే 2024-25లో బంగ్లాదేశ్‌ 5.7 శాతం, పాకిస్థాన్ 2.3 శాతం, శ్రీలంక వృద్ధి రేటు 2.5 శాతంగా ఉండవచ్చని వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది.


More Telugu News