ఎలాంటి ఏసీ కొనాలి.. ఏసీలో ఏం చూడాలి..?

  • కొత్త ఏసీ కొనేటపుడు ఈ విషయాలు మరవొద్దు
  • అవసరాన్ని బట్టి ఏసీ సామర్థ్యంలో తేడాలు
  • ఫీచర్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మండే ఎండల కారణంగా బయటకు వెళ్లలేం.. ఇంట్లో ఉండలేం అన్నట్లుగా మారింది. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల ఒకప్పుడు విలాస వస్తువుగా భావించిన ఏసీ ఇప్పుడు కనీస అవసరంగా మారిపోయింది. ఫ్యాన్ తిరుగుతున్నా రాత్రుళ్లు ఉక్కపోత తట్టుకోలేక చాలామంది ఏసీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. అయితే, ఏ అవసరానికి ఎలాంటి ఏసీ కొనుగోలు చేయాలి, ఏసీలలో రకాలు, వాటి ఫీచర్లు చాలామందికి తెలియదు. సరైన ఏసీని ఎంచుకోకపోతే చల్లగా నిద్రించే సుఖానికి దూరమవడమే కాదు కరెంట్ బిల్లు మోత మోగిపోతుంది. కొత్త ఏసీ కొనేముందు తప్పక పరిశీలించాల్సిన అంశాలు ఏంటంటే..

ఏసీ బిగించే గది విస్తీర్ణం..
ఏసీ బిగించే గది విస్తీర్ణాన్ని బట్టి సరిపడా సామర్థ్యం ఉన్న ఏసీని ఎంచుకోవాల్సి ఉంటుంది. మాస్టర్‌ బెడ్‌రూం, లివింగ్‌ రూం, పిల్లల గది.. ఇలా గదిని బట్టి విస్తీర్ణం మారుతుంటుంది. 120 చదరపు అడుగుల కంటే తక్కువ పరిమాణం ఉన్న గదికి ఒక టన్ను సామర్థ్యం ఉన్న ఏసీ చాలు.. 200 చదరపు అడుగులకు 1-2 టన్నులు, అంతకంటే పెద్ద గదులకు రెండు టన్నులకు పైబడి సామర్థ్యం ఉన్న ఏసీని ఎంచుకోవాలి.

ఏసీలలో రకాలు ఇవే..

విండో ఏసీ
పరికరాలన్నీ ఒకే బాక్స్ లో అమర్చి ఉండే ఏసీ ఇది.. బిగించడం సులువు. కిటికీ, గోడకు ఉండే ఖాళీ ప్రదేశంలో అమర్చవచ్చు. చిన్న గదిని చల్లగా ఉంచేందుకు ఈ విండో ఏసీ సరిపోతుంది. ధర కూడా తక్కువగానే ఉంటుంది. అయితే, ఈ ఏసీ ఎక్కువ శబ్దం చేస్తుంది.


స్ప్లిట్‌ ఏసీ
ఏటీఎంలలో, ఆఫీసుల్లో ఎక్కువగా ఈ స్ప్లిట్ ఏసీలనే బిగిస్తుంటారు. ఇందులో రెండు పరికరాలు ఉంటాయి. కంప్రెషర్ ఉండే భాగాన్ని ఇంటి బయట అమర్చి, మరో భాగాన్ని గదిలో అమర్చుతారు. కంప్రెషర్ బయట ఉండడం వల్ల సౌండ్ డిస్ట్రబెన్స్ ఉండదు. విండో ఏసీతో పోలిస్తే ఖరీదు కాస్త ఎక్కువగానే ఉంటుంది. బిగించడం కాస్త శ్రమతో కూడుకున్న పని.

హాట్‌ అండ్‌ కోల్డ్‌ ఏసీ
ఏసీ అంటే ఎండాకాలంలో మాత్రమే ఉపయోగపడే వస్తువనేది మధ్యతరగతి కుటంబాల అభిప్రాయం. అయితే, శీతాకాలంలోనూ ఉపయోగించుకునే ఏసీలు కూడా ఉన్నాయి. చల్లదనంతో పాటు వేడిని, గది ఉష్ణోగ్రతను పెంచే ఏసీలు కూడా ఉన్నాయి. ఈ రెండింటి కలయికతో తయారైందే హాట్ అండ్ కోల్డ్ ఏసీ. బయట వాతావరణం ఎలా ఉన్నప్పటికీ గది ఉష్ణోగ్రతను మీకు కావాల్సిన స్థితిలో ఉంచుకోవడానికి ఇది తోడ్పడుతుంది. 

పోర్టబుల్‌ ఏసీ
మిగతా ఏసీలు కేవలం ఒక్క గదికి (అమర్చిన గదికి) మాత్రమే పరిమితం.. అలా కాకుండా అవసరాన్ని బట్టి మిగతా గదులకూ మార్చుకోవాలంటే వాటిని విప్పి మళ్లీ బిగించాలి. తాత్కాలిక సర్దుబాటుకు వీలుండదు. ఈ అవసరాన్ని తీర్చేందుకు తయారుచేసిందే పోర్టబుల్ ఏసీ.. సాధారణ ఫ్యాన్ లాగా అవసరమైన గదికి తరలించి వాడుకునే వీలు ఉంటుంది.

టవర్‌ ఏసీ
ఇంట్లో గదుల పరిమాణం చిన్నగా, అవసరానికి తగ్గట్లుగా ఉంటాయి. అదే ఆఫీసులు, కాన్ఫరెన్స్ హాళ్లు, మ్యారేజ్ హాళ్లలో గదుల విస్తీర్ణం చాలా పెద్దగా ఉంటాయి. ఇలాంటి ప్రదేశాలను వేగంగా చల్లబరిచేందుకు ఉపయోగపడేవే టవర్‌ ఏసీలు.  చూడాల్సిన ఫీచర్లు ఇవే.. ఏసీలలో దుమ్ము చేరకుండా ఉండేందుకు ఎయిర్‌ ఫిల్టర్లు తప్పనిసరి. దీనివల్ల ఏసీ పరిశుభ్రంగా ఉంటుంది. తరచూ వీటిని క్లీన్ చేయిస్తే అలర్జీల బారిన పడే అవకాశం ఉండదు.
ఏసీ దానికదే శుభ్రం చేసుకునే వీలు కల్పించేదే ఆటో క్లీన్‌ ఫీచర్‌.. ఏసీలో సూక్ష్మక్రిములు వృద్ధి చెందే అవకాశం ఉండదు.  డీహ్యుమిడిఫికేషన్ ఫీచర్ తప్పనిసరి.. తేమ, తడితో గది నిండిపోకుండా ఈ ఫీచర్‌ చూసుకుంటుంది. వీటితో పాటు ఇంకా స్మార్ట్‌ కనెక్టివిటీ, ఆటో స్టార్ట్‌, ఫోర్‌-వే స్వింగ్‌, టర్బో మోడ్‌, స్లీప్‌ అలార్మ్‌ వంటి ఫీచర్లను కూడా జాగ్రత్తగా చూసి ఎంపిక చేసుకోవాలి. ఏసీల విషయంలో ఆఫ్టర్‌ సేల్స్‌ సర్వీస్‌ కూడా ముఖ్యమేనని నిపుణులు చెబుతున్నారు.

కరెంట్ వినియోగం.. స్టార్ రేటింగ్..
ఏసీల కొనుగోలు విషయంలో చాలామంది వెనుకడుగు వేయడానికి ప్రధాన కారణం కరెంట్ బిల్.. ఏసీలు విద్యుత్ ఎక్కువగా ఉపయోగించుకుంటాయి కాబట్టి నెల తిరిగేసరికి కళ్లు చెదిరే బిల్లు చేతికందుతుంది. అయితే, అన్ని ఏసీలు ఎక్కువ విద్యుత్ ను వినియోగించుకోవని నిపుణులు చెబుతున్నారు. ఏసీ సామర్థ్యం, రకం, పనితీరు ఆధారంగా వాటి విద్యుత్ వినియోగంలో తేడాలు ఉంటాయి. సదరు ఏసీలపై ముద్రించే స్టార్ రేటింగ్ ఈ విషయాన్ని తెలియజేస్తాయి. ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న ఏసీతో పోలిస్తే ఒకటి, రెండు స్టార్లు ఉన్న ఏసీల విద్యుత్ వాడకం ఎక్కువ. స్టార్ రేటింగ్ పెరిగే కొద్దీ వాటి ఖరీదు కూడా పెరుగుతుంది. ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న ఏసీ కొనుగోలు చేస్తే నెలనెలా విద్యుత్ బిల్ భారం తగ్గుతుంది.

ఇన్వర్టర్‌ ఏసీ..
ఏసీతో పెరిగే విద్యుత్ వాడకాన్ని నియంత్రించేందుకు అనువైన మరో పద్ధతి ఇన్వర్టర్ ఏసీ కొనుగోలు చేయడమే. గదిలో ఉష్ణోగ్రతను బట్టి కంప్రెసర్ పనితీరు ఉంటుంది. ఎక్కువ వేడి ఉన్నప్పుడు కంప్రెసర్ ఎక్కువగా పనిచేస్తుంది, పెద్దగా వేడి లేనప్పుడు కంప్రెసర్ పనితీరు తగ్గుతుంది. దీనివల్ల విద్యుత్ వాడకం కూడా ఆమేరకు తగ్గుతుంది.


More Telugu News