మోదీకి ప్రత్యామ్నాయం ఎవరన్న ప్రశ్నకు శశిథరూర్ చక్కని సమాధానం!

  • అసలు ఆ ప్రశ్నే అసంబద్ధమన్న శశిథరూర్
  • పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి ప్రశ్నకు చోటు లేదని స్పష్టీకరణ
  • మనం ఓ పార్టీనో, కూటమినో మాత్రమే ఎన్నుకోగలమన్న సీనియర్ నేత
  • ప్రధానమంత్రి ఎంపిక అనేది రెండో ప్రాధాన్య అంశమని స్పష్టీకరణ
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రత్యామ్నాయం ఎవరన్న ప్రశ్నకు కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఆసక్తికర సమాధానం చెప్పారు. పార్లమెంటరీ వ్యవస్థలో ఇలాంటి ప్రశ్న అర్థం లేనిదని స్పష్టం చేశారు. పార్లమెంటరీ వ్యవస్థలో నేరుగా ఓ వ్యక్తిని ప్రధానిగా ఎన్నుకోలేమని పేర్కొన్నారు. ఓ పార్టీని కానీ, కూటమిని కానీ ప్రజలు ఎన్నుకుంటారని తెలిపారు.

ప్రధాని నరేంద్రమోదీకి ప్రత్యామ్నాయం ఎవరంటూ ఓ జర్నలిస్టు తనను ప్రశ్నించారంటూ ఎక్స్ ద్వారా థరూర్ ఆ విషయాన్ని వెల్లడించారు. నిజానికి ఆ ప్రశ్న అసంబద్ధమని స్పష్టం చేశారు. ప్రెసిడెన్షియల్ విధానంలో మాత్రమే నేరుగా ఓ వ్యక్తిని ఎన్నుకునే అవకాశం ఉంటుందని, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో అలాంటి అవకాశం ఉండదని థరూర్ వివరించారు. 

మోదీకి ప్రత్యామ్నాయంగా దేశంలో సమర్థులైన నాయకులు ఉన్నారని, వారు వ్యక్తిగత అహంతో కాకుండా ప్రజా సమస్యలకు ప్రతిస్పందిస్తారని తెలిపారు. ప్రధానమంత్రి ఎంపిక అనేది రెండో ప్రాధాన్యత అంశమని శశిథరూర్ పేర్కొన్నారు. మన ప్రజాస్వామ్యాన్ని, వైవిధ్యాన్ని పరిరక్షించడమే ప్రథమమని వివరించారు. 

తిరువనంతపురం నుంచి మూడుసార్లు ఎంపీగా పనిచేసిన శశిథరూర్ నాలుగోసారి కూడా అదే స్థానం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆయనకు ప్రత్యర్థులుగా బీజేపీ నేత, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్, లెఫ్ట్ పార్టీ నుంచి పన్యన్ రవీంద్రన్ బరిలో ఉన్నారు.


More Telugu News