ద్రావిడ మోడల్ త్వరలోనే దేశానికే రోల్ మోడల్ గా మారుతుంది: కమలహాసన్

  • తమిళనాడుకు కేంద్ర ప్రభుత్వ నిధులు తక్కువగా వస్తున్నాయన్న కమల్
  • బీహార్, యూపీతో పోలిస్తే చాలా తక్కువగా నిధులు అందుతున్నాయని విమర్శ
  • ద్రావిడ మోడల్ నిన్నో, ఈరోజే వచ్చింది కాదని వ్యాఖ్య
రాజకీయ నాయకులను ప్రశ్నించడం ప్రజల హక్కు అని ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీధి మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ అన్నారు. ఈ హక్కును ప్రజలు ఉపయోగించుకుంటేనే దేశానికి మేలు జరుగుతుందని చెప్పారు. తిరుచ్చి లోక్ సభ నియోజకవర్గంలో డీఎంకే కూటమి తరపున పోటీ చేస్తున్న ఎండీఎంకే అభ్యర్థి దురై వైగోకు మద్దతుగా కమల్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

మధ్యాహ్న భోజన పథకాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ అల్పాహార పథకంగా మార్చారని కమల్ చెప్పారు. సంక్షేమ పథకాల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడుకు కేంద్ర నిధులు చాలా తక్కువగా అందుతున్నాయని దుయ్యబట్టారు. రాష్ట్రం నుంచి వసూలవుతున్న పన్ను వాటాలో... రూపాయికి కేవలం 29 పైసలను మాత్రమే కేంద్రం ఇస్తోందని అన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు పెరిగితే రాష్ట్రంలో మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. ద్రావిడ మోడల్ అనేది నిన్నో, నేడో వచ్చింది కాదని... ద్రావిడ మోడల్ త్వరలోనే దేశానికే రోల్ మోడల్ కాబోతోందని అన్నారు.


More Telugu News