పొత్తు ధ‌ర్మంలో త‌న అన్న సీటునే త్యాగం చేసిన గొప్ప వ్య‌క్తి ప‌వ‌న్‌: సుజ‌నాచౌద‌రి

  • జ‌న‌సేనానితో బీజేపీ నేత‌లు సుజ‌నాచౌద‌రి, కామినేని శ్రీనివాస్ భేటీ
  • పిఠాపురంలో ప‌వ‌న్‌ బ‌స చేసిన గోకులం గ్రాండ్‌లో స‌మావేశ‌మైన కూట‌మి నేత‌లు
  • అన్న నాగేంద్ర‌బాబును త‌ప్పించి అన‌కాప‌ల్లి లోక్‌స‌భ టికెట్ బీజేపీకి ఇచ్చినందుకు ప‌వ‌న్‌కు ధ‌న్య‌వాదాలు తెలిపిన‌ బీజేపీ నేత‌లు
  • విజ‌య‌వాడ ప‌శ్చిమ‌, కైక‌లూరులో ప‌వ‌న్ ప్ర‌చారం చేస్తానని హామీ ఇచ్చార‌న్న కాషాయ పార్టీ నేత‌లు  
ఏపీలో టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన కూట‌మి అభ్య‌ర్థుల ఎంపిక‌, ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌తో దూసుకెళ్తోంది. దీనిలో భాగంగా మంగ‌ళవారం జ‌న‌సేన‌, బీజేపీ నేత‌లు భేటీ అయ్యారు. జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను బీజేపీ నేత‌లు సుజ‌నా చౌద‌రి, కామినేని శ్రీనివాస్ క‌లిశారు. పిఠాపురంలో జ‌న‌సేనాని బ‌స చేసిన గోకులం గ్రాండ్‌లో ఈ స‌మావేశం జ‌రిగింది. అనంత‌రం సుజ‌నా చౌద‌రి, కామినేని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. 

సుజ‌నా చౌద‌రి మాట్లాడుతూ.. పొత్తు ధ‌ర్మంలో భాగంగా త‌న అన్న నాగేంద్ర‌బాబు ఎంపీ టికెట్‌నే త్యాగం చేసిన గొప్ప వ్య‌క్తి ప‌వ‌న్ అని అన్నారు. నాగేంద్ర‌బాబును త‌ప్పించి అన‌కాప‌ల్లి లోక్‌స‌భ టికెట్ బీజేపీకి ఇచ్చారు. అందుకు పవ‌న్ క‌ల్యాణ్‌కు ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను. నేను పోటీ చేస్తున్న విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో స్థానికంగా ఉన్న స‌మ‌స్య‌ల‌పై ప‌వ‌న్‌తో చ‌ర్చించ‌డం జ‌రిగింది. అక్క‌డున్న‌ పోతిన మ‌హేష్‌తో మాట్లాడి ఏ స‌మ‌స్య లేకుండా చూస్తాన‌ని జ‌న‌సేనాని అన్నారు. అంతేగాక విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చి ప‌వ‌న్ ప్ర‌చారం చేస్తాన‌ని చెప్పారు. అలాగే ఈ భేటీలో కీల‌కంగా కూటమిని ఎలా గెలిపించుకోవాల‌నే అంశంపై చ‌ర్చించామ‌ని సుజ‌నా చౌద‌రి చెప్పుకొచ్చారు. 

అనంత‌రం కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఏపీ శ్రేయ‌స్సు కోసం ఏర్పాటైన టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మిలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన భూమిక పోషించారని అన్నారు. అలాగే తాను పోటీ చేస్తున్న కైక‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించాల‌ని కోరాను. జ‌న‌సేనాని ప్ర‌చారం చేస్తాన‌ని హామీ ఇచ్చారు. పిఠాపురం ప్ర‌జ‌లు ప‌వ‌న్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నార‌ని, ఇక్క‌డ ఆయ‌న‌కు తిరుగులేద‌ని కామినేని శ్రీనివాస్ తెలిపారు.


More Telugu News