రాజ్యసభ నుంచి రిటైర్ అవుతున్న మన్మోహన్ సింగ్... తొలిసారి అడుగుపెడుతున్న సోనియాగాంధీ

  • తెలుగు రాష్ట్రాల నుంచి ముగిసిన పలువురి రాజ్యసభ పదవీ కాలం
  • ముగిసిన జోగినపల్లి సంతోష్, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్రల పదవీకాలం
  • రేపు, ఎల్లుండి ప్రమాణం చేయనున్న కొత్త రాజ్యసభ సభ్యులు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 33 ఏళ్ల తర్వాత రాజ్యసభ నుంచి రిటైర్ కాగా... ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ మొదటిసారి పెద్దల సభలో అడుగుపెట్టనున్నారు. మంగళవారంతో పలువురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగిసింది. ఇందులో మన్మోహన్ సింగ్ కూడా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి చూస్తే... టీడీపీ నుంచి కనకమేడల రవీంద్రకుమార్, బీఆర్ఎస్ నుంచి జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి సీఎం రమేశ్ ఉన్నారు.

మన్మోహన్ సింగ్ సహా 54 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం నేటితో ముగిసింది. ఇందులో తొమ్మిది మంది కేంద్రమంత్రులు ఉన్నారు. రాజ్యసభకు తొలిసారి వెళుతున్న సోనియా గాంధీ ఇటీవల రాజస్థాన్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మన్మోహన్ సింగ్ 1991 నుంచి 1996 మధ్య పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా ఉన్నారు. 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా ఉన్నారు.

కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు రేపు, ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పదిమంది కొత్త సభ్యులతో చైర్మన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఎల్లుండి మరో 11 మందితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.


More Telugu News