ఆ వివరాలు మేం ఇస్తే ఇక సీఎంగా రేవంత్ రెడ్డి ఎందుకు?: దాసోజు శ్రవణ్

  • 200 మంది రైతులు చనిపోతే ఎక్కడ చనిపోయారు? వాళ్ల పేర్లు, అడ్రస్‌లు ఇవ్వాలని ఎకసెక్కాలు చేస్తావా? అని ఆగ్రహం
  • ఆత్మహత్య చేసుకున్న రైతుల అడ్రస్‌లు కేసీఆర్ ఇస్తే నువ్వెళ్లి ఆదుకుంటావా? అని చురక
  • నీ ప్రభుత్వం ఎందుకు? నీ మంత్రులు ఎందుకు? నీ ఐఏఎస్‌లు ఎందుకు? నీ డాబు ఎందుకు? అని మండిపాటు
తెలంగాణలో చనిపోయిన రైతుల వివరాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు చెబుతున్నారని, మేం ఇచ్చాక మరి నువ్వు చేసేదేముంది? అని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్రంలో 200 మంది రైతులు చనిపోతే ఎక్కడ చనిపోయారు? వాళ్ల పేర్లు, అడ్రస్‌లు ఇవ్వాలని ఎకసెక్కాలు చేస్తావా? అని ధ్వజమెత్తారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల అడ్రస్‌లు కేసీఆర్‌ ఇస్తే.. నువ్వు వెళ్లి ఆదుకుంటావా? అన్నారు. అలాంటప్పుడు నీ ప్రభుత్వం ఎందుకు? నీ మంత్రులు ఎందుకు? నీ ఐఏఎస్‌లు ఎందుకు? నీ డాబు ఎందుకు? అని మండిపడ్డారు.

కేసీఆర్‌ ఎంతో కష్టపడి వ్యవసాయాన్ని స్థిరీకరణ చేశారని, ప్రతి సాగుభూమికి నీళ్లు అందించే ప్రయత్నం చేశారన్నారు. రైతుబంధు, రైతుబీమా అందించి.. వ్యవసాయాన్ని పండుగ చేశారన్నారు. కానీ కాంగ్రెస్ దుర్మార్గమైన, కుట్రపూరితమైన పాలన కారణంగా ఇప్పుడు రైతులు పంటలను తగులబెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల పాటు రైతాంగం పంటలు పండించి పండుగ చేసుకుంటే ఇవాళ ఎందుకు పొలాలను తగులబెట్టుకుంటున్నారో చెప్పాలన్నారు. ట్యాంకర్లతో నీళ్లు తెచ్చుకొని తడుపుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్నారు.


More Telugu News