పింఛన్ల పంపిణీ చేపట్టేలా జగన్ సర్కారును ఆదేశించండి: ఈసీకి చంద్రబాబు లేఖ

  • వాలంటీర్లపై ఎన్నికల సంఘం ఆంక్షల కొరడా
  • ఏపీలో నిలిచిన పెన్షన్ల పంపిణీ
  • చంద్రబాబే అందుకు కారణమంటూ వైసీపీ విమర్శల దాడి
  • వైసీపీ కావాలనే పెన్షన్లు ఆలస్యం చేస్తోందంటూ టీడీపీ కౌంటర్ అటాక్
వాలంటీర్లపై ఎన్నికల సంఘం ఆంక్షల కొరడా ఝళిపించిన నేపథ్యంలో, ఏపీలో పెన్షన్ల పంపిణీపై అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ఈసీకి లేఖ రాశారు. 

ఏపీలో పెన్షన్ల పంపిణీ చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని తన లేఖలో కోరారు. సచివాలయ, ఇతర సిబ్బందితో పింఛన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా, ఇంటివద్దకే వెళ్లి పింఛన్ల పంపిణీ చేసేలా ఆదేశించాలని చంద్రబాబు కోరారు. పింఛన్ల పంపిణీపై సెర్ప్ సీఈవో కుట్రలకు పాల్పడుతున్నారంటూ చంద్రబాబు తన లేఖలో ఆరోపించారు. 

మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ రాగా, అదే రోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో, వాలంటీర్లు పెన్షన్ల పంపిణీ చేపట్టరాదంటూ ఈసీ ఆదేశాలు జారీ చేయగా, ఈ వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపింది. 

చంద్రబాబే వాలంటీర్లపై ఫిర్యాదు చేసి, తద్వారా పెన్షన్ల నిలిపివేతకు కారకుడయ్యాడంటూ వైసీపీ నేతలు విమర్శల దాడి చేస్తుండగా, ఈసీ నిర్ణయాన్ని చంద్రబాబుకు ఆపాదించడమేంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ నేతలు కావాలనే పెన్షన్లు ఆలస్యం చేస్తున్నారని, టీడీపీపై ప్రజల్లో వ్యతిరేకత పెంచాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నాయకత్వం మండిపడుతోంది.


More Telugu News