వేల పుస్తకాలు చదివిన కేసీఆర్‌కు వర్షాకాలం ఎప్పుడు వస్తుందో తెలియదా?: రేవంత్ రెడ్డి

  • ముఖ్యమంత్రిగా కేసీఆర్ తెలంగాణకు చేసిన అన్యాయం తమకు తగులుకుందన్న రేవంత్ రెడ్డి
  • కాంగ్రెస్ వచ్చింది, కరవు వచ్చిందని అనడం సరికాదన్న ముఖ్యమంత్రి
  • కేసీఆర్ పాపాల కారణంగా వరుణదేవుడు వర్షాలు కురిపించడం లేదని ఎద్దేవా
కేసీఆర్ చేసిన పాపాలు ఎలాగైతే తగిలి ఆయన పిల్లలు జైలుకెళ్తున్నారో... అలాగే ముఖ్యమంత్రిగా తెలంగాణకు చేసిన అన్యాయం తమకు తగులుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ తాను చేసిన పాపాలు తమ ఖాతాలో రాయాలని భావిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ వచ్చింది, కరవు వచ్చిందని అంటున్నారని... కానీ అసలు మేం వచ్చింది ఎప్పుడు? కరవు తెచ్చింది ఎప్పుడు? అని ధ్వజమెత్తారు. వేల పుస్తకాలు చదివిన కేసీఆర్‌కు వర్షాకాలం ఎప్పుడు వస్తుంది? చలికాలం ఎప్పుడు వస్తుందో తెలియదా? అని ప్రశ్నించారు.

చలికాలమైన డిసెంబర్‌లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని... అలాంటప్పుడు వర్షాలు పడలేదని అనడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ పాపాల కారణంగానే వరుణదేవుడు వర్షాలు కురిపించడం లేదని ఎద్దేవా చేశారు. 'నీ వారసత్వంగా కరవుతో పాటు 7 లక్షల కోట్ల రూపాయల అప్పు కూడా మాకు అప్పగించావని' కేసీఆర్‌పై మండిపడ్డారు. తాము రోజుకు 18 గంటలు కష్టపడి రాష్ట్రాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

కేసీఆర్ సూర్యాపేటలో మాట్లాడుతుంటే మైక్ ఆగిపోయిందని... కానీ వారికి సాంకేతిక సమస్య వస్తే కరెంట్ ఉండటం లేదని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో తుక్కుగూడలోనే ఆరు గ్యారెంటీలు ఇచ్చామన్నారు. ఆరు గ్యారెంటీల్లో ఐదింటిని ఇప్పటికే అమలు చేసినట్లు చెప్పారు. ఈ నెల 6న తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ ఉంటుందని.. అక్కడే జాతీయ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు. ఈ సభకు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు ముఖ్యనేతలు వస్తున్నట్లు చెప్పారు.


More Telugu News