అంతమాట పడిన తరువాతనే నాలో కసి పెరిగింది: మెగాస్టార్

  • 'న్యాయం కావాలి' మూవీ గురించి ప్రస్తావించిన మెగాస్టార్ 
  • క్రాంతికుమార్ గారు అవమానించారని వెల్లడి 
  • గుండెపిండేసినట్టుగా అయిందని వివరణ
  • ఎవరిపట్ల ద్వేషం లేదని వ్యాఖ్య  
  • కసితో ఎదుగుతూ వచ్చానని చెప్పిన చిరంజీవి  

చిరంజీవి అంటే ఆవేశంతో తీరం దాటిన కెరటం .. గాలివాటుని అర్థం చేసుకుంటూ ఆకాశానికి ఎగిరిన గాలిపటం. చిరంజీవి అంటే తనని తాను మలచుకున్న శిల్పం .. వేలాది మందిని తెలుగు ఇండస్ట్రీ దిశగా నడిపించిన ఆదర్శం. అలాంటి చిరంజీవి కెరియర్లో ఎన్నో కష్టాలు ఉన్నాయి .. అవమానాలు ఉన్నాయి. అవమానాలను అభివృద్ధికి మెట్లుగా చేసుకున్న వారాయన. తాజాగా ఒక కార్యక్రమం కోసం విజయ్ దేవరకొండ చేసిన ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను ప్రస్తావించారు.

'న్యాయం కావాలి' సినిమా షూటింగు సమయంలో ఒక సంఘటన జరిగింది. నేను .. రాధిక .. శారద గారు .. జగ్గయ్య గారు .. వందల మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. నేను ఫ్లోర్ బయటికి వెళ్లాను. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి పిలిస్తే లోపలికి వచ్చాను. ఆ సమయంలో క్రాంతికుమార్ గారు క్రేన్ పై కూర్చుని కెమెరా యాంగిల్ చూసుకుంటున్నారు. ఈ సినిమాకి ఆయన నిర్మాత కూడా. ఆయన చాలా కోపంగా " ఏవయ్యా మిమ్మల్ని కూడా పిలవాలా? మీరేమైనా సూపర్ స్టార్ అనుకుంటున్నారా? అన్నారు.

"అంతమందిలో ఆయన అలా అనడంతో నాకు గుండె పిండేసినట్టుగా అయింది. ఆ రోజు మధ్యాహ్నం నాకు అన్నం కూడా తినబుద్ధి కాలేదు. ఆ సాయంత్రం మా ఇంటికి క్రాంతికుమార్ గారు కాల్ చేసి సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. ఆయనన్న మాటల్లో 'మీరేమైనా సూపర్ స్టార్ అనుకుంటున్నారా?' అనే మాటనే నాకు గుర్తుండిపోయింది. సూపర్ స్టార్ ని కావాలనే కసి అప్పుడే నాలో పెరిగింది. ఎవరిపై ఎలాంటి ద్వేషం పెట్టుకోకుండా నేను ఎదగడం కోసం అవమానాలను అనుకూలంగా మార్చుకుంటూ వెళ్లాను" అని చెప్పారు. 


More Telugu News