తీహార్ జైల్లో కేజ్రీవాల్ కు నిద్రలేని రాత్రి

  • ఇంటి భోజనం వడ్డించిన జైలు సిబ్బంది
  • తొలుత కాసేపు సిమెంట్ దిమ్మెపై సేద తీరిన కేజ్రీవాల్
  • రాత్రంతా సెల్ లో అటు ఇటు పచార్లు
ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో జరిగిన కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ ఢిల్లీలోని తీహార్ జైల్లో రిమాండ్ లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం రాత్రంతా నిద్రలేకుండానే గడిపినట్లు జైలు వర్గాలు తెలిపాయి. జైలు నంబర్ 2లోని సెల్ కు తరలించిన తర్వాత అక్కడి సిమెంట్ దిమ్మెపై కాసేపు సేదతీరిన కేజ్రీవాల్... ఆ తర్వాత నుంచి అర్ధరాత్రి దాటే వరకు సెల్ లోనే అటుఇటు పచార్లు చేశారట. 

“కేజ్రీవాల్ కు సోమవారం మధ్యాహ్నం ఇంటి భోజనం వడ్డించాం. ఆయనకు మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఇంటి భోజనానికి అనుమతి ఉంది. ఆయన షుగర్ లెవల్స్ సాధారణ స్థితికి వచ్చే వరకు ఇంటి భోజనం చేసేందుకు కోర్టు అనుమతినిచ్చింది. మంగళవారం ఉదయం ఆయన గ్లూకోజ్ లెవల్ 50గా నమోదైంది” అని జైలు వర్గాలు తెలిపాయి.

అలాగే కోర్టుకు సమర్పించిన పేర్ల జాబితా ప్రకారం కేజ్రీవాల్ తన అధికారిక కార్యకలాపాల నిమిత్తం ప్రభుత్వ అధికారులను జైల్లో కలవవచ్చు.  ఆయన వారానికి రెండుసార్లు కుటుంబ సభ్యులను కలుసుకోవచ్చు. అయితే ఆ పేర్ల జాబితాకు జైలు భద్రతాధికారులు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఆయనకు రెగ్యులర్ గా వైద్య పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. జైల్లో ఆయనకు టీవీ చూసే సదుపాయం కల్పించారు. జైలు కార్యకలాపాల షెడ్యూల్ సమయంలో మినహా మిగతా సమయాల్లో వార్తలు, వినోద, క్రీడా కార్యక్రమాలతో కూడిన 18 నుంచి 20 చానళ్లను ఆయన వీక్షించొచ్చు.

కేజ్రీవాల్ భార్య నేడు ఆయన్ను కలిసే అవకాశం ఉంది. తీహార్ జైల్లో పటిష్ఠ భద్రత ఉంది. జైలు నంబర్ 2లో 650 మంది ఖైదీలు ఉండగా వారిలో 600 మంది దోషులుగా శిక్ష అనుభవిస్తున్నారు. ఖైదీల కదలికలను నిరంతరం కనిపెట్టేందుకు 650 సీసీటీవీలను ఏర్పాటు చేశారు. అలాగే ఏవైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే స్పందించేందుకు క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయి.


More Telugu News