‘బాయ్‌కాట్ ఇండియా’ తర్వాత కానీ.. తొలుత మీ భార్యల చీరలు తగలబెట్టండి: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా

  • షేక్ హసీనా గెలుపులో భారత్ హస్తం ఉందని ప్రతిపక్ష బీఎన్‌పీ ఆరోపణ
  • భారత ఉత్పత్తులను నిషేధించాలని కోరుతూ ‘బాయ్‌కాట్ ఇండియా’కు పిలుపు
  • భారత్‌ను గొప్ప స్నేహితుడిగా అభివర్ణించిన హసీనా
  • భారతదేశ మసాలాలు లేకుండా వండుకుని తినాలని ప్రతిపక్ష నేతలకు హసీనా చురక
బంగ్లాదేశ్‌లోని ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్‌పీ) ఎత్తుకున్న ‘బాయ్‌కాట్ ఇండియా’ ప్రచారంపై ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తీవ్రంగా స్పందించారు. దేశంలో భారత వ్యతిరేక సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న ప్రతిపక్ష నాయకులపై మండిపడ్డారు. భారత ఉత్పత్తులను తర్వాత బాయ్‌కాట్ చేయొచ్చని, అంతకంటే ముందు మీ భార్యలు కట్టుకున్న భారత చీరలను తగలబెట్టాలని ప్రతిపక్ష నేతలను కోరారు  

హసీనా, ఆమె పార్టీ అవామీ లీగ్‌పై భారత అనుకూల ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్న ప్రతిపక్ష బీఎన్‌పీ ఈ ఏడాది జనవరిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హసీనా గెలుపునకు భారత్ సహకరించిందని ఆరోపిస్తోంది. అందులో భాగంగా భారత ఉత్పత్తులను బహిష్కరించాలని కోరుతూ 'బాయ్‌కాట్ ఇండియా’ ప్రచారానికి పిలుపునిచ్చింది. 

ప్రతిపక్షాల ఆరోపణలు, బాయ్‌కాట్ భారత్ పిలుపుపై ప్రధాని షేక్ హసీనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌ను ‘గొప్ప స్నేహితుడు’గా అభివర్ణించిన హసీనా.. బీఎన్‌పీ నేతలు తొలుత వారి భార్యల వద్ద ఉన్న భారత చీరలను తగలబెట్టాలని డిమాండ్ చేశారు. బీఎన్‌పీ అధికారంలో ఉన్నప్పుడు వారి భార్యలు భారత్ వెళ్లి మరీ అక్కడి చీరలు కొనుగోలు చేయడం తనకు తెలుసని అన్నారు. అక్కడ కొన్న చీరలను వారు బంగ్లాదేశ్‌లో అమ్ముకునే వారని పేర్కొన్నారు. అంతేకాదు, భారత్ నుంచి గరమ్ మసాలా, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి వంటి ఉత్పత్తులు కూడా వస్తున్నాయని, అవి లేకుండా బీఎన్‌పీ నాయకులు ఎందుకు వండుకోకూడదని ప్రశ్నించారు. భారత్ నుంచి దిగుమతి అయ్యే మసాలాలు లేకుండా వండుకోవాలని సూచించారు. ఇవి లేకుండా వారు ఆహారం తినగలరా? అని ప్రశ్నించిన హసీనా వాటికి సమాధానం చెప్పాలని కోరారు.


More Telugu News