నేడు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్న షర్మిల.. కడప నుంచి షర్మిల పోటీ చేసే అవకాశం!

  • నేడు కడప జిల్లాలో పర్యటించనున్న షర్మిల
  • ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రార్థనల అనంతరం జాబితా విడుదల
  • సాయంత్రం కడపలో ఇఫ్తార్ విందులో పాల్గొననున్న షర్మిల
ఏపీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ నేడు విడుదల చేయనుంది. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్సార్ ఘాట్ వద్ద ఆమె ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించనున్నారు. అనంతరం అభ్యర్థుల జాబితాను ఆమె ప్రకటించనున్నారు. సాయంత్రం కడపలో ఇఫ్తార్ విందులో ఆమె పాల్గొంటారు.  

మరో వైపు కడప లోక్ సభ స్థానం నుంచి షర్మిల పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. కడప నుంచి ఆమె అభ్యర్థిత్వాన్ని హైకమాండ్ ఖరారు చేసినట్టు సమాచారం. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నిన్న కాంగ్రెస్ ఎలెక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్, షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా 117 అసెంబ్లీ స్థానాలు, 17 ఎంపీ స్థానాల అభ్యర్థులపై చర్చించారు. పొత్తులో భాగంగా కమ్యూనిస్టులతో సర్దుబాటు నేపథ్యంలో ఇతర స్థానాలను పెండింగ్ లో ఉంచినట్టు సమాచారం. పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఎన్నికల బరిలో లేరని తెలుస్తోంది.


More Telugu News