విస్తారాలో మరింత ముదిరిన ‘పైలెట్ల సంక్షోభం’.. పదుల సంఖ్యలో సర్వీసుల రద్దు

  • మంగళవారం దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో విమాన సర్వీసుల రద్దు
  • సోమవారం కూడా ఇదే పరిస్థితి.. అసౌకర్యానికి గురవుతున్న ప్రయాణికులు
  • జీతాల విధానాన్ని సవరించడాన్ని వ్యతిరేకిస్తున్న పైలెట్లు
  • అనారోగ్యం సాకులతో డ్యూటీకి డుమ్మా కొడుతున్న వైనం
ఎయిరిండియాలో ‘విస్తారా’ విలీనానికి ముందు జీతాల విధానాన్ని సవరించడాన్ని నిరసిస్తూ పైలెట్లు విధులకు డుమ్మా కొడుతున్నారు. దీంతో మంగళవారం నాటికి విమానయాన సంస్థ విస్తారాలో పైలెట్ల సంక్షోభం మరింత ముదిరింది. అనారోగ్య కారణాల సాకుతో పైలెట్లు విధులకు దూరంగా ఉంటున్నారు. పైలెట్లు అందుబాటులో లేకపోవడంతో మంగళవారం ఉదయం కీలక నగరాల నుంచి బయలుదేరాల్సిన 38 విస్తారా విమాన సర్వీసులు రద్దయ్యాయి. ముంబై నుంచి వెళ్లాల్సిన 15 సర్వీసులు, ఢిల్లీ నుంచి 12, బెంగళూరు నుంచి బయలుదేరాల్సిన 11 సర్వీసులను రద్దు చేసినట్టు విస్తారా ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. సోమవారం కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. 50కిపైగా సర్వీసులు రద్దవ్వగా దాదాపు 160 విమానాలు ఆలస్యంగా బయలుదేరాయి.

సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పాటు వేర్వేరు కారణాలతో గత కొన్ని రోజులుగా గణనీయ సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు చేశామని ప్రకటనలో విస్తారా పేర్కొంది. పలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయని సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది. విమాన సర్వీసులపై సత్వర స్పందన లేకపోవడం, ఎయిర్‌పోర్టుల్లో గంటల తరబడి నిరీక్షణపై ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఎయిరిండియాలో విలీనానికి ముందు జీతాల విధానాన్ని సవరిస్తూ పైలెట్లకు విస్తారా ఎయిర్‌లైన్స్ మెయిల్స్ పంపించింది. ఈ నోటీసుపై సంతకం చేయాలని కోరింది. సంతకం చేయని పైలెట్లు విలీనం పరిధిలో ఉండబోరని హెచ్చరించింది.


More Telugu News