రోహిత్ శర్మ పేరిట ఐపీఎల్‌లో చెత్త రికార్డు

  • అత్యధికంగా 17 సార్లు డకౌట్ అయిన హిట్‌మ్యాన్
  • దినేశ్ కార్తీక్‌తో సమంగా నిలిచిన రోహిత్
  • రాజస్థాన్‌పై మ్యాచ్‌లో ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో గోల్డెన్ డకౌట్ అయిన ముంబై స్టార్ బ్యాటర్
గత రాత్రి (సోమవారం) రాజస్థాన్ రాయల్స్‌పై మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ పేరిట అవాంఛిత రికార్డు నమోదయింది. తొలి ఓవర్‌లోనే ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో సున్నా పరుగులకే ఔట్ అయిన హిట్‌మ్యాన్ ఐపీఎల్ చరిత్రలో అత్యధికసార్లు డకౌట్ అయిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. దినేశ్ కార్తీక్‌‌తో సంయుక్తంగా ఈ చెత్త రికార్డును పంచుకున్నాడు. గత రాత్రి ఔట్‌తో కలిపి ఐపీఎల్‌లో మొత్తం 17 సార్లు రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు.

కాగా రాజస్థాన్‌పై మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి ఓవర్‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో కీపర్ సంజూ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి రోహిత్ వెనుదిరిగాడు. రోహిత్ శర్మ ఔట్ అవడంతో స్టేడియం అంతా నిశ్శబ్దంగా మారిపోయిన విషయం తెలిసిందే.

ఐపీఎల్‌లో ఎక్కువ సార్లు డకౌట్‌ అయిన ఆటగాళ్లు వీరే
1. దినేశ్ కార్తీక్ - 17 సార్లు (224 మ్యాచ్‌ల్లో)
2. రోహిత్ శర్మ -17 సార్లు (241 మ్యాచ్‌ల్లో)
3. సునీల్ నరైన్ -15 సార్లు (98 మ్యాచ్‌ల్లో)
4. మన్‌దీప్ సింగ్ - 15 సార్లు (98 మ్యాచ్‌ల్లో)
5. పీయూష్ చావ్లా - 15 సార్లు (88 మ్యాచ్‌ల్లో)
6. గ్లెన్ మ్యాక్స్‌వెల్ - 15 సార్లు ( 123 మ్యాచ్‌ల్లో)

కాగా ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్‌ సోమవారం రాత్రి వరుసగా మూడవ ఓటమిని చవిచూసింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ముంబై ఇండియన్స్ బ్యాటర్లను రాజస్థాన్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, నాండ్రే బర్గర్, యుజ్వేంద్ర చాహల్ అల్లాడించారు. అద్భుతంగా బౌలింగ్ చేసి వరుసగా విరామాల్లో వికెట్లు తీశారు. ముఖ్యంగా బౌల్ట్ ముంబై ఇన్నింగ్స్ ఆరంభ ఓవర్‌లోనే 2 వికెట్లు తీసి ముంబైని కోలుకోలేని దెబ్బకొట్టాడు. తొలి ఓవర్‌లో 5వ బంతికి రోహిత్ శర్మను, 6వ బంతికి నమన్ ధీర్‌ను ఔట్ చేశాడు. బౌల్ట్ వేసిన రెండో ఓవర్‌లో డేవాల్డ్ బ్రేవిస్‌ను కూడా ఔట్ చేశాడు. 

దీంతో 20/4 స్కోరుతో ముంబై పీకల్లోతు కష్టాల్లో పడింది. మిగతా బ్యాటర్లు కూడా ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్ధిక్ పాండ్యా 34, తిలక్ వర్మ 32 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇక రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, చాహల్ చెరో 3 వికెట్లు, బర్గర్ 2 వికెట్లు, అవేశ్ ఖాన్ 1 చొప్పున వికెట్లు తీశారు. 125 పరుగుల టార్గెట్‌ను రాజస్థాన్ రాయల్స్ 15.5 ఓవర్లలోనే ఛేదించింది.


More Telugu News