అరవింద్ కేజ్రీవాల్‌కు తీహార్ జైల్లో ఏ గదిని కేటాయించారంటే..!

  • కేజ్రీవాల్ డైలీ రొటీన్ ఉదయం ఆరున్నర గంటలకు ప్రారంభం
  • ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా చాయ్, కొన్ని బ్రెడ్ స్లైస్‌లు ఇవ్వనున్న జైలు అధికారులు
  • సాయంత్రం ఐదున్నర గంటలకు డిన్నర్
  • రాత్రి ఏడు గంటల వరకు మళ్లీ జైలు గదికి కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు తీహార్ జైల్లో రెండో నెంబర్ గదిని కేటాయించారు. మద్యం అంశానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో అరెస్టైన కేజ్రీవాల్‌కు ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టు 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను సాయంత్రం జైలుకు తరలించారు. జైల్లో మిగతా ఖైదీల మాదిరిగానే కేజ్రీవాల్ డైలీ రొటీన్ ఉదయం ఆరున్నర గంటలకు ప్రారంభమవుతుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా చాయ్, కొన్ని బ్రెడ్ స్లైస్‌లు ఇస్తారు. కాలకృత్యాలు పూర్తయ్యాక కోర్టు విచారణ ఉంటే తీసుకువెళతారు. లేదంటే సీఎం తన న్యాయబృందంతో సమావేశం కావడానికి అనుమతి ఇస్తారు.

ఉదయం పదిన్నర గంటల నుంచి పదకొండు గంటల మధ్య భోజనం ఇస్తారు. పప్పు, కూర, అన్నం, ఐదు రొట్టెలు ఇస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ముఖ్యమంత్రి తన గదిలో ఉండాలి. మధ్యాహ్నం 3.30 గంటలకు ఒక కప్పు చాయ్, రెండు బిస్కట్లు ఇస్తారు. సాయంత్రం 4 గంటలకు మళ్లీ తన లాయర్లతో సమావేశం కావొచ్చు. సాయంత్రం ఐదున్నర గంటలకు డిన్నర్ ఇస్తారు. రాత్రి ఏడు గంటల కల్లా మళ్లీ జైలు గదికి పంపిస్తారు.

జైల్లో కేజ్రీవాల్‌కు కొన్ని వెసులుబాట్లు కల్పించారు. టీవీ చూసే సదుపాయం ఉంది. 18 నుంచి 20 ఛానళ్ల వరకు చూసేందుకు అనుమతించారు. 24/7 వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఆయన డయాబెటిస్‌తో బాధపడుతున్నందున రెగ్యులర్‌గా చెకప్ చేస్తారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా ప్రత్యేక డైట్ ఇవ్వాలని ఆయన లాయర్లు కోరారు. కేజ్రీవాల్ వారానికి రెండుసార్లు తన కుటుంబ సభ్యులతో మాట్లాడవచ్చు.


More Telugu News