పెన్షన్లు ఆలస్యం చేసేందుకు కుట్రలు చేస్తున్నారు: వైఎస్ షర్మిల

  • వైసీపీ ప్రభుత్వం కావాలనే పెన్షన్లను ఆలస్యం చేస్తోందన్న షర్మిల
  • 3వ తేదీ నుంచి వారం పాటు పెన్షన్లు ఇస్తామని సీఎస్ చెప్పారని వెల్లడి
  • వెంటనే పెన్షన్లు ఇవ్వకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరిక
ఏపీలో పింఛన్ల పంపిణీ అంశం రాజకీయ రంగు పులుముకుంది. వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ చేయించరాదని ఈసీ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పింఛన్లు ఇవ్వకుండా టీడీపీ అడ్డుకుందని వైసీపీ నేతలు... కావాలనే ప్రభుత్వం పింఛన్లను ఆలస్యం చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వెఎస్ షర్మిల మాట్లాడుతూ... కావాలనే వైసీపీ ప్రభుత్వం జాప్యం చేస్తోందని మండిపడ్డారు. 

పింఛన్లు పంపిణీ చేయడానికి రాష్ట్రంలో వాలంటీర్లు తప్ప ఉద్యోగులు లేరా? అని షర్మిల ప్రశ్నించారు. పింఛన్లను ఆలస్యం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ విషయంపై తాను చీఫ్ సెక్రటరీతో మాట్లాడానని... 3వ తేదీ నుంచి వారం పాటు పెన్షన్లు ఇస్తామని వారు తెలిపారని అన్నారు. అంటే లబ్ధిదారులు పెన్షన్లు అందుకోవడానికి వారం రోజులు ఆగాలా? అని ప్రశ్నించారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ (డీబీటీ) ద్వారా పెన్షన్లు ఇవ్వాలని ఈసీ ఆదేశిస్తే ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. డీబీటీ ద్వారా పెన్షన్లను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే పెన్షన్లను ఇవ్వకపోతే ఎక్కడికక్కడ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.


More Telugu News