టీడీపీకి చెడ్డపేరు తెచ్చేందుకు జగన్ వాలంటీర్ల అంశాన్ని ఉపయోగించుకుంటున్నారు: సీఎస్ ను కలిసి వినతిపత్రం ఇచ్చిన టీడీపీ నేతలు

  • వాలంటీర్లు పింఛన్ల పంపిణీకి దూరంగా ఉండాలన్న ఈసీ
  • టీడీపీ నేతల వల్లే పెన్షన్ల పంపిణీ నిలిచిపోయిందంటున్న వైసీపీ
  • ఇంటి వద్దనే పింఛన్లు అందించే ఏర్పాటు చేయాలని సీఎస్ కు స్పష్టం చేసిన టీడీపీ నేతలు
ఏపీలో పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లు దూరంగా ఉండాలని ఈసీ ఆదేశించగా, టీడీపీ నేతల కారణంగానే పెన్షన్ల పంపిణీ నిలిచిపోయిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో, టీడీపీ నేతలు రాష్ట్ర సచివాలయానికి వెళ్లారు. ఇంటింటికీ వెళ్లి పింఛన్లు ఇవ్వాలని కోరుతూ సీఎస్ కు వినతిపత్రం ఇచ్చారు. 

పెన్షన్ల పంపిణీలో కావాలనే జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. పింఛన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు డిమాండ్ చేశారు. గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా రెండు గంటల్లో పింఛను పంపిణీ చేయొచ్చని అన్నారు. కలెక్టర్లతో మాట్లాడి నిర్ణయం చెబుతామని సీఎస్ పేర్కొన్నారని నక్కా ఆనంద్ బాబు వెల్లడించారు. 

టీడీపీకి ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చేందుకు జగన్ వాలంటీర్ల అంశాన్ని ఉపయోగించుకుంటున్నారని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆరోపించారు. పింఛన్ల పంపిణీ అంశంపై ఉత్తర్వులు ఇచ్చింది సీఈవో అని, అలాంటప్పుడు ఎన్నికల సంఘం ఆదేశాలను చంద్రబాబుకు ఎలా ఆపాదిస్తారని ప్రశ్నించారు. ఈసీ ఉత్తర్వులు అమలు చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. 

గతంలో ఇచ్చినట్లే ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు అందించాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. పింఛన్ల పంపిణీని ఈ నెల 5 లోపు పూర్తి చేయాలని అన్నారు.


More Telugu News