అమెరికాలో బ్యారేజీ కుంగిపోలేదా? అని కేసీఆర్ ఎదురు ప్రశ్న వేస్తున్నారు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం

  • బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నీటి పారుదల రంగాన్ని సర్వనాశనం చేశారని విమర్శ
  • దేశంలోనే రైతులకు పంట బీమా ఇవ్వని రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని వ్యాఖ్య
  • కమీషన్ల కోసం ప్లాన్, డిజైన్లు లేకుండా ప్రాజెక్టులు నిర్మించారన్న మంత్రి
మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయాయని అంటుంటే అమెరికాలో బ్యారేజీ కుంగిపోలేదా? అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎదురు ప్రశ్న వేస్తున్నారని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నీటి పారుదల రంగాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన జిల్లాల పర్యటనలో మాట్లాడుతున్న ప్రతి మాట అబద్ధమే అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పంట బీమా ఇవ్వలేదన్నారు. అసలు దేశంలోనే పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు.

విద్యుత్ విషయంలో ఎంతో సాధించామని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరమన్నారు. కేసీఆర్ డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారని... అందుకే అబద్ధాలు చెప్పారని విమర్శించారు. తన పార్టీ మిగలదనే భయం ఆయనలో ప్రారంభమైందన్నారు. జాతీయ పార్టీ అని చెప్పుకున్నారు... కానీ ఇంత త్వరగా ఏ పార్టీ కూడా కుప్పకూలలేదన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఉండదని జోస్యం చెప్పారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప ఆ పార్టీ మొత్తం ఖాళీ అవుతుందన్నారు.

నీటి పారుదల రంగం గురించి మాట్లాడే నైతిక అర్హత కేసీఆర్‌కు ఉందా? అని ప్రశ్నించారు. కమీషన్ల కోసం ప్లాన్, డిజైన్లు లేకుండా ప్రాజెక్టులు నిర్మించారన్నారు. కాళేశ్వరంపై మాట్లాడేందుకు ఆయనకు సిగ్గుండాలని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టు వారి హయాంలోనే కూలిపోయిందన్నారు. కాళేశ్వరం కోసం విద్యుత్ ఖర్చు ఏడాదికి రూ.10వేల కోట్లు అవుతోందన్నారు. ఎన్టీపీసీకి సహకరించి ఉంటే 4వేల మెగావాట్ల విద్యుత్ ఉచితంగా వచ్చేదన్నారు.


More Telugu News