వాలంటీర్లను విధులకు దూరంగా ఉంచాలని ఫిర్యాదు చేయడం కుట్రపూరిత చర్య: తమ్మినేని సీతారాం

  • పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను దూరంగా ఉంచాలన్న ఈసీ
  • విపక్షాలపై మండిపడుతున్న వైసీపీ నేతలు
  • ఇప్పుడా వాలంటీర్ల విధులను ఎవరు నిర్వర్తించాలన్న తమ్మినేని సీతారాం
రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం ఆదేశించడంపై వైసీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్లపై విపక్ష నేతలు కక్ష కట్టారంటూ మండిపడుతున్నారు. 

తాజాగా ఈ అంశంపై స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. వాలంటీర్లను విధులకు దూరంగా ఉంచాలని ఫిర్యాదు చేయడం కుట్ర పూరిత చర్య అని విమర్శించారు. 

వాలంటీర్లకు అధికారాలు అప్పజెప్పడం జరగదని, వారు అందించే సేవలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని... వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించిన రోజే సీఎం జగన్ చెప్పారని తమ్మినేని సీతారాం వివరించారు. అదే ఆలోచనతో, అదే ఆచరణతో వాలంటీర్లు అధికారం జోలికి వెళ్లకుండా, ప్రజా సేవలోనే ముందుకు వెళుతున్నారని స్పష్టం చేశారు. 

ఇవాళ వాలంటీర్లను పక్కనబెట్టాలని ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చిందని, దాంతో కొన్ని లక్షల మంది వాలంటీర్లు వారు అందించాల్సిన సేవలకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని తమ్మినేని వెల్లడించారు. ఇప్పుడా వాలంటీర్ల విధులను ఎవరు నిర్వర్తిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు.


More Telugu News