భయం ఉండాలి .. భయపడుతూ చేసిన సినిమానే ఇది: హీరో సిద్ధూ జొన్నలగడ్డ

  • శుక్రవారం థియేటర్లకు వచ్చిన 'టిల్లు స్క్వైర్'
  • తొలిరోజునే హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా 
  • సీక్వెల్ కనుక సహజంగానే భయపడ్డానని వెల్లడి   
  • పెర్ఫెక్ట్ కంటెంట్ కోసం వెయిట్ చేయడంలో తప్పులేదని వ్యాఖ్య

సిద్ధూ జొన్నలగడ్డ .. కొంతకాలం క్రితం ఆయన నుంచి వచ్చిన 'డీజే టిల్లు' భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ సినిమాకి సీక్వెల్ గా ఆయన చేసిన 'టిల్లు స్క్వైర్' రీసెంటుగా థియేటర్లకు వచ్చింది. తొలి ఆటతోనే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో 'గ్రేట్ ఆంధ్ర'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధూ మాట్లాడాడు. 

'టిల్లు స్క్వైర్' సినిమాను నేను భయపడుతూనే చేశాను. మనమేదైనా ఒక పని చేస్తున్నప్పుడు, ఎక్కడైనా పొరపాటు చేస్తున్నామా? అనే ఒక ప్రశ్న వేసుకుంటూనే ముందుకు వెళుతూ ఉండటం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే 'డీజే టిల్లు' సినిమా చాలామందికి నచ్చింది. అలాగే ఈ సినిమా కూడా అందరికీ నచ్చుతుందా లేదా అనే ఒక భయం ఉంటుంది .. అలాంటి భయం ఉండాలి కూడా" అని అన్నాడు. 

"ఈ సినిమాను గురించి నేను కాన్ఫిడెంట్ గా చెప్పలేదని అంటున్నారు. ఎపుడైనా మనం వండిన కూర బాగుందనే విషయం మనమే చెప్పకూడదు. ఆ మాట తిన్నవాడు చెబితేనే బాగుంటుంది. అందువలన నా సినిమా చూసినవాళ్లు ఈ సినిమాను గురించి మాట్లాడుకోవాలని నేను అనుకున్నాను. ఈ సినిమా కోసం చాలా సమయాన్ని కేటాయించారని అంటున్నారు. మాకు సంతృప్తి కలిగే అవుట్ పుట్ వచ్చేవరకూ పనిచేయడంలో తప్పులేదు కదా" అని సమాధానమిచ్చాడు.


More Telugu News