రిషభ్ పంత్‌పై ధోనీ భార్య సాక్షి ఆస‌క్తిక‌ర పోస్ట్‌..!

  • విశాఖపట్టణంలో అర్ధ శ‌త‌కంతో ఆక‌ట్టుకున్న పంత్‌
  • రిషభ్ పంత్ ఇన్నింగ్స్‌పై ఇన్‌స్టా వేదిక‌గా  స్పందించిన‌ ఎంఎస్‌ ధోనీ భార్య సాక్షి
  • 'వెల్‌క‌మ్ బ్యాక్ రిష‌భ్ పంత్' అంటూ ఇన్‌స్టా స్టోరీ
  • అలాగే భ‌ర్త ధోనీపై కూడా మ‌రో పోస్ట్ పెట్టిన సాక్షి
విశాఖపట్టణంలో ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో డీసీ కెప్టెన్ రిషభ్ పంత్‌ హాఫ్ సెంచ‌రీ బాదాడు.  
ఓపెన‌ర్ డేవిడ్‌ వార్నర్ అవుట‌యిన త‌ర్వాత‌ క్రీజులోకి వచ్చిన రిషభ్.. మునుపటి పంత్‌ను తలపించాడు. త‌న‌దైన శైలిలో బ్యాట్ ఝ‌లి ఝళిపించి బంతులను స్టాండ్స్‌లోకి తరలించాడు. ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌తో అర్ధ శ‌త‌కం పూర్తిచేసుకున్నాడు. మొత్తంగా 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేసి అవుటయ్యాడు.

రిషభ్ పంత్ ఆడిన ఈ ఇన్నింగ్స్‌పై మ‌హేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా స్పందించారు. 'వెల్‌క‌మ్ బ్యాక్ రిష‌భ్ పంత్' అంటూ త‌న ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు. అలాగే మ్యాచ్‌ చివ‌ర‌లో బ్యాట్ ఝళిపించిన త‌న భ‌ర్త ఎంఎస్ ధోనీపై కూడా ఆమె ఇన్‌స్టాలో ఒక పోస్ట్ పెట్టారు. 'అక్క‌డ‌ మ‌హీ ఉండ‌డంతో అస‌లు మ్యాచ్ ఓడిపోయామ‌నే భావ‌నే క‌లగ‌లేదు' అని సాక్షి త‌న పోస్టులో పేర్కొన్నారు.   

ఇదిలా ఉంటే.. 2022 డిసెంబ‌ర్‌లో రోడ్డు ప్ర‌మాదం కార‌ణంగా రిష‌భ్ పంత్ దాదాపు ఏడాదిన్న‌ర పాటు క్రికెట్‌కు దూర‌మ‌య్యాడు. ఇటీవ‌లే పూర్తిగా కోలుకున్న అతడు నేరుగా ఐపీఎల్ 2024 ద్వారా తిరిగి ఆట‌లో పున‌రాగ‌మ‌నం చేశాడు. మొద‌టి రెండు మ్యాచులలో పంత్ అంత‌గా ఆక‌ట్టుకోలేదు. దీంతో అత‌డి ఆట‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. మునుప‌టి పంత్ ఎక్క‌డ? అంటూ కొంద‌రు నోటికి ప‌ని చెప్పారు. దీనికి నిన్న‌టి ఇన్నింగ్స్‌తో రిష‌భ్ గ‌ట్టి స‌మాధానం చెప్పాడు. 

దాదాపు 465 రోజుల త‌ర్వాత అత‌డు అర్ధ శ‌త‌కం న‌మోదు చేశాడు. ఇక ఆదివారం నాటి మ్యాచ్‌లో విజ‌యంతో మొత్తానికి ఢిల్లీ కేపిటల్స్ గాడిలో పడిందనే చెప్పాలి. ఈ 17వ సీజ‌న్‌లో తాను ఆడిన మొద‌టి రెండు మ్యాచుల్లోనూ ఢిల్లీ ఓట‌మి పాలైంది. ఇలా రెండు వరుస పరాజయాల తర్వాత తొలి విక్ట‌రీ న‌మోదు చేసింది. అలాగే వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్తున్న డిఫెండింగ్ చాంపియన్ చెన్నైకి ఓటమి రుచి చూపింది.


More Telugu News