కచ్ఛతీవు దీవిని నెహ్రూ శ్రీలంకకు ఇద్దామనుకున్నారు: మంత్రి జైశంకర్

  • 1974లో ఆ దీవిని ఇందిర ప్రభుత్వం శ్రీలంకకు ఇచ్చేసిందన్న మంత్రి
  • భారత జాలర్ల హక్కులకు ఢోకా లేదని అప్పట్లో హామీ ఇచ్చిందని వెల్లడి
  • ఆ తరువాత రెండేళ్లకు మరో ఒప్పందంలో ఈ హక్కులూ శ్రీలంకకు వదులుకుందని వ్యాఖ్య
తమిళనాట ‘కఛ్చతీవు దీవి’ వివాదం చెలరేగుతున్న వేళ భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నెహ్రూ ఆ దీవిని శ్రీలంకకు ఇవ్వాలని భావించినట్టు తెలిపారు. 1974లో అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వం ఈ దీవిని శ్రీలంకదిగా గుర్తిస్తూ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. నాటి వివరాలను జైశంకర్ మీడియాతో పంచుకున్నారు. అప్పటి విదేశాంగ శాఖ మంత్రి పార్లమెంటులో చేసిన ప్రకటనను వెల్లడించారు. ‘‘పాక్ జలసంధిలో భారత్-శ్రీలంక సరిహద్దు గుర్తింపు.. ఇరు దేశాలకు న్యాయం చేసే తీరులో జరిగింది. అంతేకాకుండా, ఈ ద్వీప జలాలపై ఇరు దేశాల జాలరుల హక్కులను కాపాడాము’’ అని అప్పటి విదేశాంగ శాఖ మంత్రి వెల్లడించినట్టు జైశంకర్ తెలిపారు. 

అయితే, ఆ తరువాత రెండేళ్లకు శ్రీలంకతో జరిగిన మరో ఒప్పందంలో భారత్ తన హక్కులను వదులుకుందని తెలిపారు. ‘‘రెండో ఒప్పందంలో భారత్.. కచ్ఛతీవు దీవి జలాల్లో ఇరు దేశాలూ ప్రత్యేక ఆర్థిక జోన్లు నెలకొల్పాలని ప్రతిపాదించింది. ఆయా జోన్లపై ఇరు దేశాలకు పూర్తి హక్కులు ఉంటాయని పేర్కొంది. కచ్ఛతీవు జలాలతో పాటు శ్రీలంక ఆర్థిక జోన్లలో భారత జాలర్లు చేపలవేట సాగించరని పేర్కొంది’’ అని జైశంకర్ చెప్పుకొచ్చారు. అలా.. 1974లో కాపాడుకున్న భారత జాలర్ల హక్కులను మరో రెండేళ్లకే వదులుకున్నారని మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించారు. 

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కచ్ఛతీవు దీవి అంశం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. తమిళనాడుకు చెందిన అనేక మంది జాలర్లు అక్కడి జలాల్లో చేపల వేటకు వెళ్లి శ్రీలంకలో జైలు పాలవుతున్నారు. అయితే, ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే శ్రీలంకకు ఈ దీవి వదులుకుందన్న విషయం సమాచార హక్కు చట్టంతో తాజాగా వెలుగులోకి రావడంతో వివాదం మొదలైంది.


More Telugu News