అందమైన యువతిపై తాంత్రిక శక్తుల ప్రయోగమే 'తంత్ర' .. 'ఆహా'లో!

  • అనన్య నాగళ్ల ప్రధాన పాత్రగా 'తంత్ర'
  • మార్చి 15న థియేటర్లకు వచ్చిన సినిమా 
  • క్షుద్ర ప్రయోగాల చుట్టూ తిరిగే కథ
  • ఈ నెల 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్  

గతంలో తెలుగు ప్రేక్షకులను 'తులసిదళం' .. 'కాష్మోరా' వంటి సినిమాలు భయపెట్టాయి. ఆ తరువాత ఈ తరహా కథలు పెద్దగా రాలేదు. హారర్ జోనర్లో దెయ్యాల కథలే తప్ప .. క్షుద్ర ప్రయోగాలకి సంబంధించిన కంటెంట్ రాలేదు. మళ్లీ ఇప్పుడు 'మా ఊరి పొలిమేర' విజయాన్ని సాధించిన దగ్గర నుంచి, ఈ తరహా కథలపై కసరత్తు చేయడం మొదలైంది. 

అలా ఇటీవల వచ్చిన సినిమానే 'తంత్ర'. అనన్య నాగళ్ల ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, క్రితం నెల 15వ తేదీన విడుదలైంది. శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి రెడీ అవుతోంది. ఈ నెల 5వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. 

గ్రామీణ నేపథ్యంలో నడిచే ఈ కథలో 'రేఖ' పాత్రలో అనన్య నాగళ్ల కనిపిస్తుంది. అందమైన .. అమాయకమైన ఈ యువతిని ఒక క్షుద్ర మాంత్రికుడు 'బలి' ఇవ్వాలనుకుంటాడు. అతను ఆమెను ఎంచుకోవడానికి కారణం ఏమిటి? రేఖ నేపథ్యం ఏమిటి? అనేదే కథ. థియేటర్ల నుంచి ఓ మాదిరి రెస్పాన్స్ ను రాబట్టుకున్న ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి మంచి మార్కులు తెచ్చుకుంటుందేమో చూడాలి. 


More Telugu News