తగ్గిన వాణిజ్య గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర

  • 19 కేజీల క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌రపై రూ. 30.50 త‌గ్గింపు
  • ఢిల్లీలో ప్ర‌స్తుతం క‌మ‌ర్షియ‌ల్ సిలండ‌ర్ ధ‌ర రూ. 1764.50 
  • 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండ‌ర్ ధ‌ర కూడా రూ. 7.50 త‌గ్గిన వైనం
  • గృహ అవ‌స‌రాల కోసం వినియోగించే సిలిండ‌ర్ ధ‌ర‌లు యథాతథం
చ‌మురు కంపెనీలు 19 కేజీల క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌రపై రూ. 30.50 త‌గ్గించాయి. దీంతో దేశ రాజ‌ధాని ఢిల్లీలో ప్ర‌స్తుతం క‌మ‌ర్షియ‌ల్ సిలండ‌ర్ ధ‌ర రూ. 1764.50 గా ఉంది. అలాగే 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండ‌ర్ ధ‌ర కూడా రూ. 7.50 త‌గ్గింది. కాగా, మార్చి 1వ తేదీన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండ‌ర్ ధ‌రను పెంచిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ నెల మాత్రం రూ. 30.50 త‌గ్గించాయి. త‌గ్గిన ధ‌ర‌లు ఇవాళ్టి నుంచి అమ‌ల్లోకి వ‌చ్చాయి. ఇక‌ గృహ అవ‌స‌రాల కోసం వినియోగించే సిలిండ‌ర్ ధ‌ర‌ల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయ‌లేదు. 

ఇదిలాఉంటే.. ఇంధన ధరలు, మార్కెట్ డైనమిక్స్‌లో చోటు చేసుకునే హెచ్చుతగ్గుల కార‌ణంగా గ్యాస్‌ ధరలలో సవరణలు జరుగుతుంటాయి. ఫిబ్రవరి 1న ఇండేన్ గ్యాస్ సిలిండర్ల ధరలు మెట్రో నగరాలైన ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నైలలో ఒక్కొక్కటి ఒక్కో రేట్లు ఉన్నాయి. 

అయితే, మార్చి 1వ తేదీ రాగానే అన్ని మెట్రో నగరాల్లో ఇండేన్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు గణనీయంగా పెరిగాయి. ఇక ధరల తగ్గుదల వెనుక ఉన్న కచ్చితమైన కారణాలు తెలియ‌నప్పటికీ, అంతర్జాతీయ చమురు ధరలలో మార్పులు, పన్నుల విధానాలలో మార్పులు, సరఫరా-డిమాండ్ వంటి వివిధ అంశాలు అటువంటి సవ‌ర‌ణ‌ల‌కు దోహదం చేస్తుంటాయ‌నేది మార్కెట్‌ నిపుణులు చెబుతున్న‌మాట‌.


More Telugu News