ఏలూరులో దారుణం.. మత్తు ఇంజక్షన్ ఇచ్చి విశ్రాంత ఉద్యోగి ఇంటిని దోచుకున్న వైద్యుడు

  • ఇంజక్షన్ ప్రభావం నుంచి కోలుకోలేక బాధితుడు మల్లేశ్వరరావు మృతి
  • గతేడాది డిసెంబరు 24న ఘటన
  • తొలుత సహజ మరణంగానే భావించిన కుటుంబ సభ్యులు
  • నిందితుడు భానుసుందర్ ప్రవర్తనపై అనుమానంతో నిలదీత
  • పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసుల గాలింపు
ఏలూరులో ఓ వైద్యుడు దారుణానికి తెగబడ్డాడు. రిటైర్డ్ ఉద్యోగికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి హతమార్చాడు. ఆపై ఇంట్లోకి చొరబడి అందినకాడికి దోచుకున్నాడు. పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. చొదిమెళ్లకు చెందిన బత్తిన మల్లేశ్వరరావు (63) పోస్టల్‌శాఖలో పనిచేసి రిటైరయ్యారు. అదే గ్రామానికి చెందిన కొవ్వూరి భానుసుందర్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. మల్లేశ్వరరావుతో సన్నిహితంగా మెలిగే వైద్యుడు గతేడాది డిసెంబరు 24న ఆయన ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఆయన ఒక్కడే వుండడాన్ని గమనించిన భానుసుందర్.. వైద్యం నెపంతో ఇంజక్షన్ ఇవ్వడంతో మల్లేశ్వరరావు మత్తులోకి జారుకున్నారు. అనంతరం ఇంట్లోని బంగారు నగలు, నగదు దోచుకుని పరారయ్యాడు. 

మత్తు ఇంజక్షన్ కారణంగా మగతలోకి వెళ్లిపోయిన మల్లేశ్వరరావు ఆ తర్వాత కోలుకోలేక చనిపోయారు. కుటుంబ సభ్యులు తొలుత దానిని సహజ మరణంగానే భావించారు. అయితే, భానుసుందర్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో నిలదీశారు. ఆ తర్వాతి నుంచి అతడు కనిపించడం మానేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న భానుసుందర్ కోసం గాలిస్తున్నారు. కాగా, గతంలోనూ ఏలూరు త్రీటౌన్ పరిధిలో వైద్యం పేరుతో నిందితుడు ఇలా రోగులను దోచుకున్నట్టు తెలిసింది. ఏలూరు త్రీటౌన్, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లలో భానుసుందర్‌పై ఇప్పటికే కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు.


More Telugu News