ఫోన్ ట్యాపింగ్ పై పోలీసులను ఆశ్రయించిన సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్

  • తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు
  • పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్
  • త్వరలోనే మీడియాకు అన్ని విషయాలు చెబుతానని వెల్లడి
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా, సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ పోలీసులను ఆశ్రయించారు. తన ఫోన్ ను కూడా ట్యాపింగ్ చేశారని ఫిర్యాదు చేశారు. 

గతంలో ఇంటెలిజన్స్ అదనపు ఎస్పీగా వ్యవహరించిన ఎన్.భుజంగరావు తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని శ్రీధర్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తన వద్ద ఆధారాలను ఆయన పోలీసులకు అందించారు. భుజంగరావు తనను ఆఫీసుకు పిలిపించి బెదిరించారని ఆరోపించారు. బీఆర్ఎస్ సర్కారు తనపై అక్రమ కేసులు పెట్టిందని అన్నారు. త్వరలోనే మీడియా ముందుకు వచ్చి  అన్ని విషయాలు వివరిస్తానని తెలిపారు.

కాగా, ఫోన్ ట్యాపింగ్ ఉదంతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావును, హైదరాబాద్ నగర భద్రతా విభాగం అదనపు డీసీపీ తిరుపతన్నలను రాష్ట్ర పోలీస్ శాఖ సస్పెండ్ చేసింది. 

ఈ కేసులో అరెస్టయిన ప్రణీత్ ఇచ్చిన సమాచారం సంచలనం సృష్టించింది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, భుజంగరావు, తిరుపతన్న గత ప్రభుత్వ హయాంలో ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసినట్టు తీవ్ర ఆరోపణలు వచ్చాయి.


More Telugu News