పాకిస్థాన్ జట్టు కెప్టెన్ గా మళ్లీ బాబర్ అజామ్

  • వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్సీ నుంచి వైదొలగిన బాబర్ అజామ్
  • టీ20ల్లో షహీన్ అఫ్రిది, టెస్టుల్లో షాన్ మసూద్ కు కెప్టెన్సీ ఇచ్చిన పీసీబీ
  • ఆసీస్ తో టెస్టు సిరీస్ లో, కివీస్ తో టీ20 సిరీస్ లో ఘోరంగా ఓడిన పాక్
  • కెప్టెన్సీ నుంచి తప్పుకున్న షహీన్ అఫ్రిది 
  • బాబర్ అజామ్ ను కెప్టెన్ గా నియమిస్తూ పీసీబీ ప్రకటన
గత కొంతకాలంగా పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రదర్శన దిగజారింది. గతేడాది భారత్ లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో ఆ జట్టు దారుణ ప్రదర్శన చేసింది. ఆ తర్వాత పాక్ జట్టులో ప్రక్షాళన పేరుతో అనేక మార్పులు చేశారు.

కెప్టెన్సీ నుంచి బాబర్ అజామ్ తప్పుకోగా... షహీన్ అఫ్రిదికి టీ20 కెప్టెన్సీ అప్పగించారు. షాన్ మసూద్ ను టెస్టు జట్టుకు సారథిగా నియమించారు. అయినప్పటికీ పాక్ పరాజయ పరంపరకు అడ్డుకట్ట పడలేదు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ లోనూ, న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ లోనూ పాక్ ఘోరంగా ఓడిపోయింది. 

ఈ నేపథ్యంలో, టీ20 కెప్టెన్సీ నుంచి షహీన్ షా అఫ్రిది తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామంతో, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అత్యవసర సమావేశం నిర్వహించి, బాబర్ అజామ్ కే మళ్లీ పట్టం కట్టాలని నిర్ణయించింది.

బాబర్ అజామ్ ను వన్డే, టీ20 కెప్టెన్ గా నియమిస్తున్నట్టు సోషల్ మీడియాలో పీసీబీ ఓ ప్రకటన చేసింది. జాతీయ సెలెక్షన్ కమిటీ ఏకగ్రీవ సిఫారసు మేరకు బాబర్ అజామ్ ను కెప్టెన్ గా నియమించాలని పీసీబీ చైర్మన్ మొహిసిన్ నఖ్వీ నిర్ణయం తీసుకున్నారని ఆ పోస్టులో వెల్లడించారు.


More Telugu News