నిన్న నా సెక్యూరిటీ ఆఫీసర్ ఒక్క మాట చెప్పాడు: చంద్రబాబు

  • కడప జిల్లాలో ప్రవేశించిన చంద్రబాబు ప్రజాగళం యాత్ర
  • ప్రొద్దుటూరులో పుట్టపర్తి సర్కిల్ వద్ద భారీ సభ
  • రాష్ట్రంలో గంజాయి పరిస్థితులపై చంద్రబాబు ఆవేదన
  • తన భద్రతా అధికారి చెప్పిన ఓ యథార్థ ఘటనను అందరికీ వివరించిన వైనం
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం యాత్ర ఇవాళ కడప జిల్లాలో ప్రవేశించింది. ప్రొద్దుటూరులోని పుట్టపర్తి సర్కిల్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఓ ఆసక్తికర అంశం వెల్లడించారు. 

"నిన్న నా సెక్యూరిటీ ఆఫీసర్ ఒక్క మాట చెప్పాడు. సార్... చాలా బాధతో చెబుతున్నా... మీరేం చేస్తారో తెలియదు... మీరే అధికారంలో లేరు... కానీ మీ దృష్టికి తీసుకువరావాలని చెబుతున్నా అన్నాడు. 

రాష్ట్రంలో గంజాయి అత్యంత ప్రమాదకర అంశంగా మారింది సార్.. పిల్లలు తెలిసో, తెలియకో దీనికి బానిసలైపోతున్నారు... వాళ్ల జీవితాలు నాశనం అయిపోతున్నాయి సార్... నాకు తెలిసిన ఓ ఉదాహరణ చెబుతాను సార్ అని ఒక మాట చెప్పాడు. 

ఇది విజయవాడలో జరిగిన ఒక యథార్థ సంఘటన. ఇలాంటివి కొన్ని లక్షలు ఉన్నాయి. విజయవాడలో బీసీ వర్గానికి చెందిన వ్యక్తి సెలూన్ పెట్టుకుని బతుకుతున్నాడు. భార్య ఒక చిన్న ఉద్యోగం చేస్తూ నెలకు రూ.30 వేలు సంపాదిస్తున్నారు. ఓ కాలనీలో అద్దెకు ఉంటున్నారు. 

ఆ కాలనీలోకి గంజాయి వాడకం ప్రవేశించింది. వాళ్ల అబ్బాయికి కూడా గంజాయి అలవాటైంది. అదొక వ్యసనంలా మారిపోయింది. దాంతో ఆ దంపతులు తమ పిల్లవాడ్ని హాస్టల్ లో చేర్చితే బాగుపడతాడు అని ఆలోచించారు. ఆ కుర్రాడ్ని హాస్టల్ లో చేర్చారు. 

కానీ, గంజాయికి బానిసైన ఈ కుర్రాడు హాస్టల్ నుంచి పారిపోయి ఎక్కడెక్కడో తిరిగాడు... తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంట్లో వాళ్లు కట్టడి చేయడంతో, డబ్బుల కోసం ఇంట్లోనే దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. ఆ డబ్బులతో గంజాయి తాగేవాడు. దాంతో, ఆ అబ్బాయిని హైదరాబాదులోని ఓ పునరావాస కేంద్రంలో చేర్చి రూ.5 లక్షలు ఖర్చు చేశారు. చేతికందిన బిడ్డ ఆ విధంగా నాశనమైపోతే ఆ తల్లిదండ్రులు ఎంత వేదన అనుభవించి ఉంటారో చూడండి. రేపు మీ బిడ్డలు కూడా అలాగే అయిపోతే పరిస్థితి ఏంటి? 

రాష్ట్రంలో జే బ్రాండ్ మద్యంతో ప్రజల జీవితాలను, ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నారు. నేను అధికారంలో ఉన్నప్పుడు ఒక మద్యం సీసా రూ.60 ఉంటే... ఇప్పుడెంతకు అమ్ముతున్నారు? అది తాగినా కిక్ రాకపోతే, మళ్లీ ఇంకో క్వార్టర్ తాగుతున్నారు. ఆ విధంగా రోజుకు రూ.400 ఖర్చు చేస్తున్నారు. తిండి లేక, ఇల్లు గడవక మీ కుటుంబం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించండి! 

ఈ డబ్బులు ఎవరికి పోతున్నాయి? మీలో ఇంకా చైతన్యం రాకపోతే ఎలా? మీ రక్తాన్ని తాగే జలగ ఈ జగన్ మోహన్ రెడ్డి. గంజాయి పరిస్థితిపై సమీక్ష చేయడం నీకు చేతకాదా? ఐదేళ్లు దద్దమ్మ ముఖ్యమంత్రి లాగా ఉన్నావా? నేను చెబుతున్నా... నేను ముఖ్యమంత్రిని అయ్యాక 100 రోజుల్లో రాష్ట్రంలో గంజాయి అమ్మేవాడు ఎవడైనా ఉంటే, వాడు ఈ భూమ్మీద ఉండడానికి వీల్లేదు... అదీ నా పరిపాలన. 

గంజాయికి అదనంగా ఇప్పుడు డ్రగ్స్ వచ్చాయి. విశాఖకు 25 వేల కిలోల డ్రగ్స్ వచ్చాయి. చేతకాని దద్దమ్మలు నాపై విమర్శలు చేస్తున్నారు. నేను సీఎంగా ఉంటే... వాటిని దిగుమతి చేసుకున్నవాడ్ని, వాడికి సపోర్ట్ చేసినవాడ్ని మక్కెలు విరగ్గొట్టి బొక్కలో వేసేవాడ్ని... అదీ తెలుగుదేశం పార్టీ సమర్థత. 

జగన్ రెడ్డీ... కల్లబొల్లి మాటలు, సమాజాన్ని నాశనం చేసే మాటలు వద్దు. నీ వల్ల జాతి సర్వనాశనం అయిపోతోంది. ఒకప్పుడు నేను ఐటీ విప్లవం తీసుకువచ్చి తెలుగు యువతను ప్రపంచం నలుమూలలకు పంపించాను. 

కానీ, ఇప్పుడు మన యువత గంజాయి, జే బ్రాండ్ మద్యం, డ్రగ్స్ కు అలవాటుపడి నిర్వీర్యం అయిపోతున్నారు... అదే నా బాధ, అదే నా ఆవేదన, అదే నా ఉక్రోషం. ఇవాళ మాంచి ఎండలో మీటింగ్ పెట్టినా మీరు పెద్ద ఎత్తున తరలివచ్చారంటే.. ఈ ప్రభుత్వం పట్ల మీలో ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతోంది" అని చంద్రబాబు వాడీవేడిగా ప్రసంగించారు.


More Telugu News