విరాట్ కోహ్లీ వ‌ర‌ల్డ్ రికార్డు!

  • ఒకే వేదిక (బెంగ‌ళూరు) లో అత్య‌ధిక టీ20 ర‌న్స్ (3,276) చేసిన ఆట‌గాడిగా విరాట్‌
  • బంగ్లాదేశ్ ప్లేయ‌ర్‌ ముష్ఫిక‌ర్ ర‌హీం (మీర్పూర్-3,239) ను వెన‌క్కి నెట్టిన కింగ్ కోహ్లీ
  • నిన్న‌టి మ్యాచ్‌లో కేకేఆర్‌పై 59 బంతుల్లోనే 83 ప‌రుగులు చేసిన ర‌న్ మెషీన్‌
  • ఇదే మ్యాచ్‌లో క్రిస్ గేల్ రికార్డు సైతం బ్రేక్ 
  • ఆర్‌సీబీ త‌ర‌ఫున అత్య‌ధిక సిక్సులు (241) కొట్టిన బ్యాట‌ర్‌గా విరాట్ కోహ్లీ
బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్‌) తో జ‌రిగిన మ్యాచ్‌లో ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ ప‌లు రికార్డులు నెల‌కొల్పాడు. నిన్న‌టి మ్యాచ్‌లో 59 బంతుల్లోనే 83 ర‌న్స్ చేసి మ‌రో అద్భుత‌మైన ఇన్నింగ్స్ తో అభిమానుల‌ను అల‌రించిన విష‌యం తెలిసిందే. ఓపెన‌ర్‌గా వ‌చ్చిన విరాట్ 83 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇలా ఈ మ్యాచ్‌లో 83 ర‌న్స్ చేసిన కోహ్లీ మ‌రో వ‌ర‌ల్డ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఒకే వేదిక‌లో అత్య‌ధిక టీ20 ర‌న్స్ (3,276) చేసిన ఆట‌గాడిగా నిలిచాడు. 

ఇంతకుముందు ఈ రికార్డు బంగ్లాదేశ్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ముష్ఫిక‌ర్ ర‌హీం పేరిట ఉండేది. మీర్పూర్ వేదిక‌గా అత‌డు ఇప్ప‌టివ‌ర‌కు 3,239 ప‌రుగులు చేశాడు. ఇప్పుడు కింగ్ కోహ్లీ అత‌డిని దాటేశాడు. దీంతో బంగ్లాదేశ్ ప్లేయ‌ర్ రెండో స్థానానికి ప‌డిపోయాడు. ఇక మూడు, నాలుగు స్థానాల్లో ఇంగ్లండ్ ఆట‌గాడు అలెక్స్ హేల్స్‌, బంగ్లా ప్లేయ‌ర్ త‌మీమ్ ఇక్బాల్ ఉన్నారు. ట్రెంట్ బ్రిడ్జి వేదిక‌పై హేల్స్ 3,036 ర‌న్స్ చేస్తే.. మీర్పూర్ వేదిక‌గా త‌మీమ్ 3,020 ప‌రుగుల చేశాడు. 

గేల్ రికార్డు బ్రేక్ చేసిన కింగ్ కోహ్లీ
ఐపీఎల్‌లో ఆర్‌సీబీ త‌ర‌ఫున అత్య‌ధిక సిక్సులు (241) కొట్టిన బ్యాట‌ర్‌గా కింగ్ కోహ్లీ నిలిచాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ రికార్డు విండీస్ ప్లేయర్ క్రిస్ గేల్ (239) పేరిట ఉండేది. అత‌డు కూడా ఆర్‌సీబీ త‌ర‌ఫున 239 సిక్సులు బాదాడు. గేల్ త‌ర్వాతి స్థానాల్లో ఏబీ డివిలియ‌ర్స్ (ఆర్‌సీబీ -238), కీర‌న్ పొలార్డ్ (ఎంఐ-221), రోహిత్ శ‌ర్మ (ఎంఐ-210) ఉన్నారు. 

అలాగే నిన్న‌టి మ్యాచులో కోహ్లీ చేసిన 83 ర‌న్స్ మ‌రో రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. కేకేఆర్‌పై అత్య‌ధిక ప‌రుగులు చేసిన మూడో ఆట‌గాడిగా నిలిచాడు. ఇప్ప‌టివ‌ర‌కు కోల్‌క‌తాపై 33 మ్యాచులు ఆడిన విరాట్ 944 ప‌రుగులు చేశాడు. ఇంత‌కుముందు మూడో స్థానంలో 907 ర‌న్స్‌తో శిఖ‌ర్ ధావ‌న్ ఉన్నాడు. ఇప్పుడు అత‌డిని ర‌న్ మెషీన్ దాటేశాడు. ఇక ఈ జాబితాలో మొద‌టి రెండు స్థానాల్లో డేవిడ్ వార్న‌ర్ (1075), రోహిత్ శ‌ర్మ (1040) ఉన్నారు.   

ఇక శుక్ర‌వారం నాటి మ్యాచ్ విష‌యానికి వ‌స్తే 83 ప‌రుగుల విరాట్ భారీ ఇన్నింగ్స్ వృథా అయింద‌నే చెప్పాలి. ఆర్‌సీబీ నిర్దేశించిన 183 ప‌రుగుల టార్గెట్‌ను శ్రేయ‌స్ అయ్య‌ర్ సార‌థ్యంలోని కేకేఆర్ కేవ‌లం మూడు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 16.5 ఓవ‌ర్ల‌లోనే ఛేదించింది. ఈ విజ‌యంతో కోల్‌క‌తా జ‌ట్టు పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానానికి ఎగ‌బాకింది. మొద‌టి స్థానంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే) కొన‌సాగుతోంది. ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు రెండు మ్యాచులు ఆడిన సీఎస్‌కే రెండింటిలోనూ విజ‌యం సాధించింది.


More Telugu News