నా బ్రాండ్ ఇది... జగన్ బ్రాండ్ అది: ప్రొద్దుటూరులో చంద్రబాబు

  • కడప జిల్లాలో చంద్రబాబు ప్రజాగళం యాత్ర
  • ప్రొద్దుటూరులోని పుట్టపర్తి సర్కిల్ లో భారీ సభ
  • ఈసారి జగన్ ఇంటికి పోవడం ఖాయమన్న చంద్రబాబు
  • జగన్ కు ప్రాజెక్టుల గురించి ఏమీ తెలియదని విమర్శలు
  • ఈయనకు కనీసం శ్రీశైలం ఎక్కడుందో తెలుసా? అంటూ ఎద్దేవా 
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రజాగళం ఎన్నికల ప్రచార యాత్రను కొనసాగిస్తున్నారు. ఈ మధ్యాహ్నం కడప జిల్లా ప్రొద్దుటూరులోని పుట్టపర్తి సర్కిల్ లో నిర్వహించిన భారీ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఈసారి జగన్ ఇంటికి పోవడం ఖాయమని అన్నారు. ఐదేళ్లలో రాయలసీమకు ఏంచేశావు? అంటూ సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్ విసిరారు. రాయలసీమకు నీరు అందిస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. జగన్ కు సీమ అంటే హింస, హత్యా రాజకీయాలు అని విమర్శించారు. కానీ తెలుగదేశం పార్టీకి సీమ అంటే నీళ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమలు అని ఉద్ఘాటించారు. 

కమల్ హాసన్ కంటే పెద్ద నటుడు

జగన్ కు నీటి విలువ తెలియదని, కనీసం ప్రాజెక్టుల గురించి కూడా తెలియదని విమర్శించారు. శ్రీశైలం ఎక్కడుందో ఈయనకు తెలుసా? అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాజోలిబండ ప్రాజెక్టు ఎక్కడుందో కూడా తెలియదని, కానీ అన్నీ తెలిసినట్టు నటిస్తుంటాడని వ్యాఖ్యానించారు. 

ఈయన కమల్ హాసన్ కంటే పెద్ద నటుడు అని, అందుకే ఇతడిని కరకట్ట కమలహాసన్ అని పిలుస్తుంటానని వ్యంగ్యం ప్రదర్శించారు. గతంలో గెలిపించిన పులివెందుల ప్రజలు కూడా ఇక జగన్ ను నమ్మరని, ఎందుకు నమ్మరో కూడా చెబుతానని చంద్రబాబు వివరించారు. జనంలో విపరీతమైన మార్పు వచ్చిందని అన్నారు. ట్రెండు మారిందని, ఎన్నికల్లో వైసీపీ బెండు తీయడం ఖాయమని పేర్కొన్నారు. 

పవన్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా

ఇవాళ్టి సభలో జనసైనికులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. పవన్ కల్యాణ్ ఈ రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా, పేదలకు న్యాయం జరగడమే ఆశయంగా పనిచేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ గెలవకూడదు, జగన్ ఎలాంటివాడో నేను చిన్నప్పటి నుంచి చూశాను... కరుడుగట్టిన దుర్మార్గుడు ఈ జగన్... అందుకే వ్యతిరేక ఓటు చీలకుండా ఉండడానికి పొత్తు పెట్టుకుంటున్నామని మొదట చెప్పిన వ్యక్తి పవన్ కల్యాణ్. ఆయనను ఈ ప్రొద్దుటూరు సభలో మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 

ట్యాంకు నిండుగా ఉంటేనే నీళ్లొస్తాయి

రాష్ట్రంలో 12 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. ట్యాంకు నిండుగా ఉంటే, కుళాయి తిప్పతే నీళ్లు వస్తాయి, అదే ట్యాంకులో నీళ్లు లేకపోతే, కుళాయి తిప్పినప్పుడు అడుగున ఉన్న ఉన్న బురద వస్తుంది. ఈ దోపిడీదారుడు జగన్ మోహన్ రెడ్డి ఆ పరిస్థితి తీసుకువచ్చాడు. 

జగన్ కు సంపద సృష్టించడం తెలియదు. కడప స్టీల్ ప్లాంట్  వచ్చి ఉంటే కొన్ని వేలమందికి ఉద్యోగాలు వచ్చేవి. తద్వారా వాళ్ల కొనుగోలు శక్తి పెరిగేది. దాంతో, పరోక్షంగా మరింతమందికి ఉపాధి కలిగేది. నేను కియా మోటార్స్ విషయంలో అదే చేశాను. నీళ్లు లేవంటే గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి కియా మోటార్స్ కు నేనే ప్రారంభోత్సవం చేశాను. కరవుసీమ అనంతపురంలో తయారైన కియా కార్లు ప్రపంచమంతా పరుగులు తీస్తున్నాయంటే అదీ తెలుగుదేశం పార్టీ విజన్. 

అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్ ను రాయలసీమకు తీసుకువచ్చాను... అది నా బ్రాండ్. ఓసారి శంకుస్థాపన చేసిన స్టీల్ ప్లాంట్ కే మళ్లీ శంకుస్థాపన చేయడం జగన్ బ్రాండ్. ప్రజలను మోసం చేయడం, పరిశ్రమలను తరిమివేయడం జగన్ బ్రాండ్. నేను జాకీ పరిశ్రమను తీసుకువస్తే, అది ఇతర రాష్ట్రాలకు పోయే పరిస్థితి కల్పించారు. అమరరాజా పారిపోయే పరిస్థితి వచ్చింది. కప్పం కట్టలేక, వీళ్ల దౌర్జన్యాలు భరించలేక పరిశ్రమలు పారిపోతే యువతకు ఉద్యోగాలు వస్తాయా? 

ముద్దులు పెట్టాడు... బుగ్గలు నిమిరాడు... మీరు ఐసైపోయారు!

గత ఎన్నికలప్పుడు ఒక మాట చెప్పాడు. మా నాన్న చనిపోయాడు, తండ్రి లేని బిడ్డను, మా చిన్నాన్న ఉండేవాడు, ఆయనను కూడా చంపేశారు అని తలమీద చేయి పెట్టాడు. బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు... దాంతో జనాలు ఐసైపోయారు... ఏదో చేస్తాడని ఊహాగానాలకు వెళ్లిపోయారు. మంచి సమయాన్ని చేజార్చుకున్నారు. ఇప్పుడు జనాలకు వాస్తవాలు అర్థమవుతున్నాయి. 

సీమలో 52 సీట్లలో 49 సీట్లలో వైసీపీని గెలిపించారు... ఎప్పుడైనా సరే... సీమలో ఇంత మంది ప్రజలు నాపై నమ్మకం పెట్టుకున్నారు, వీళ్ల పరిస్థితి ఏంటి? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాను? ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చాను? ఎన్ని రోడ్లు వేశాను? ఏం మంచి పనులు చేశాను? అని ఈ జగన్ ఒక్కరోజైనా ఆలోచించాడా? ఎంతసేపటికీ ఏం ఆలోచించాడు... అవినాశ్ రెడ్డిని ఎలా కాపాడుకోవాలి? ఇదే ఆలోచన తప్ప సీమ అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. 

ఈ ఐదేళ్లు నేను సీఎంగా ఉండుంటే నా కల నెరవేరేది

రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు రూ.12 వేల కోట్లు ఖర్చు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పోలవరం పూర్తి చేసి గోదావరి నీళ్లను రాయలసీమకు తీసుకువరావాలన్నది నా కల. పోలవరం నీళ్లు రాయలసీమకు వస్తే ఈ ప్రాంతాన్ని కొట్టే ప్రాంతమే ఉండదు. ఆ సంకల్పంతోనే పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశాను. నాగార్జునసాగర్ వరకు నీళ్లు తీసుకురావాలని ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాను, పట్టిసీమను పూర్తి చేశాను. 

ఈ ఐదేళ్లు నేను సీఎంగా ఉండుంటే గోదావరి నీళ్లు నేరుగా బనకచర్ల వచ్చేవి, అప్పుడు రాయలసీమ సస్యశ్యామలం అయ్యేది... నా జీవితాశయం నెరవేరేది. కానీ ఈ దుర్మార్గుడు వచ్చి మీ గొంతు కోశాడు. ఈ కడప జిల్లాలో ఒక పరిశ్రమ అయినా వచ్చింది, కనీసం పులివెందులో అయినా ఒక్క కంపెనీ అయినా పెట్టారా? 

మన జిల్లా వాడు అనో, మన రెడ్డి అనో భావిస్తే... మనకే నష్టం

అతడిపై మీకు ఇంకా కోపం రాలా! మన జిల్లా వాడు అనో, మన రెడ్డి అనో, మనవాడు అనో, లేక మన కులం అనో, మన మతం అనో మీరు భావిస్తున్నట్టున్నారు. ఆ భావన మీలో ఇంకా ఉన్నట్టుంది.. ఆ భావన పోకపోతే మనకే నష్టం. ఒక్క పెట్టుబడి కూడా తీసుకురాకుండా, పరిశ్రమలను తరిమివేసే వ్యక్తిని మనం క్షమిస్తామా? నేను కూడా రాయలసీమ బిడ్డనే. ఇక్కడే పుట్టాను... ఇప్పుడే హామీ ఇస్తున్నా... ఈ రాయలసీమను రతనాలసీమగా మార్చుతా... మీ రుణం తీర్చుకుంటా. కులాన్ని చూడొద్దండీ... చెప్పిన విషయాలు అర్థం చేసుకోండి" అంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు.


More Telugu News