రాహుల్ గాంధీపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థిపై 242 క్రిమినల్ కేసులు!

  • వయనాడ్ లో రాహుల్ పై పోటీ చేస్తున్న రాష్ట్ర బీజేపీ చీఫ్ సురేంద్రన్
  • మూడు పేజీల్లో కేసుల వివరాలను వెల్లడించిన సురేంద్రన్
  • ఎక్కువ కేసులు శబరిమల ఆందోళనలకు చెందినవన్న జార్జ్ కురియన్
కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండోసారి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ పై బీజేపీ తరపున సురేంద్రన్ బరిలోకి దిగారు. కేరళ బీజేపీ చీఫ్ గా సురేంద్రన్ వ్యవహరిస్తున్నారు. మరోవైపు సురేంద్రన్ పై 242 క్రిమినల్ కేసులు ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన కేసుల వివరాలను మూడు ఫుల్ పేజీల్లో సురేంద్రన్ ప్రకటించారు. ఎర్నాకులం బీజేపీ అభ్యర్థి కేఎస్ రాధాకృష్ణన్ పై కూడా 211 క్రిమినల్ కేసులు ఉన్నారు. 

సురేంద్రన్ కేసులపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి జార్జ్ కురియన్ మాట్లాడుతూ... ఆయనపై నమోదైన కేసుల్లో ఎక్కువ కేసులు 2018లో జరిగిన శబరిమల ఆందోళనలకు చెందినవని చెప్పారు. వీటిలో చాలా కేసులు కోర్టుల్లో ఉన్నాయని తెలిపారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ ఏదైనా బంద్ చేసినా, నిరసన కార్యక్రమం చేపట్టినా పోలీసులు కేసులు నమోదు చేశారని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కేసుల వివరాలను సమర్పించడం తప్పనిసరి అని చెప్పారు. 

ఈ కేసులపై బీజేపీ జాతీయ కార్యదర్శి బీఎల్ సంతోష్ స్పందిస్తూ... మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో జాతీయవాదిగా ఉండటం చాలా కష్టమని అన్నారు. ఆ ప్రాంతాల్లో జాతీయవాదులు అతి కష్టం మీద జీవితం గడుపుతుంటారని చెప్పారు. అయితే, వారు చేస్తున్న పోరాటం చాలా గొప్పదని కితాబునిచ్చారు. 

మరోవైపు, రాహుల్ గాంధీ ఇంకా తన కేసుల వివరాలను వెల్లడించాల్సి ఉంది. లోక్ సభ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఏప్రిల్ 4. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 8.


More Telugu News