విశాఖలో దారుణం.. బోధన సిబ్బంది లైంగిక వేధింపులు భరించలేక ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

  • మధురవాడలోని కొమ్మాదిలో ఘటన
  • హాస్టల్ భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి బలవన్మరణం
  • తన ఆత్మహత్యతోనైనా వేధింపుల విషయం బయటకు వస్తుందంటూ సోదరికి మెసేజ్
  • తొందరపడొద్దని ధైర్యం చెబుతూ సోదరి మెసేజ్
  • విద్యార్థిని ఆరోపణల్లో నిజం లేదన్న కళాశాల యాజమాన్యం
లైంగిక వేధింపులు భరించలేని ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని హాస్టల్ భవనం పైనుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. విశాఖపట్టణం మధురవాడ సమీపంలోని కొమ్మాదిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. అనకాపల్లి జిల్లా నాతవరం మండలానికి చెందిన బాలిక (17) కొమ్మాదిలోని ప్రైవేటు కళాశాలలో డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజినీరింగ్ (సీఎంఈ) మొదటి సంవత్సరం చదువుతోంది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కళాశాల హాస్టల్ భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రక్తపు మడగులో పడివున్న ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు తెలిపారు.

బోధన సిబ్బంది లైంగిక వేధింపుల వల్లే
ఆత్మహత్యకు ముందు బాధిత బాలిక తన సోదరితో వాట్సాప్ చాట్ చేసింది. కళాశాలలోని బోధన సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, కాబట్టి తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు పేర్కొంది. కళాశాలలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయని, ఫ్యాకల్టీనే వేధింపులకు పాల్పడుతుంటే ఎవరికి చెప్పుకోగలమని ఆవేదన వ్యక్తం చేసింది. చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, తనలాగే చాలామంది బాధపడుతున్నారని పేర్కొంది. 

ఎవరికైనా చెబితే తమ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో మాలో ఎవరో ఒకరు చనిపోతేనే ఈ విషయం ప్రపంచానికి తెలుస్తుందని, అందుకే ఈ పని చేస్తున్నాను.. మంచి కుమార్తెను కాలేకపోయినందుకు తనను తండ్రి క్షమించాలని వేడుకుంది. దీనికి స్పందించిన సోదరి ‘తొందరపడొద్దని’ ధైర్యం చెబుతూ అర్ధరాత్రి దాటాక 1.01గంటలకు చివరిసారి బదులిచ్చింది. అయినప్పటికీ బాలిక ఆత్మహత్య చేసుకుంది. అంతకుముందు.. ‘అమ్మా, నాన్న మీ ఆరోగ్యం జాగ్రత్త. అక్కా-బావకు అభినందనలు. అక్కా.. పండంటి బిడ్డకు జన్మనివ్వు. చెల్లీ, నీ ఫ్యూచర్ ‌పై ఫోకస్ పెట్టు.  స్టడీలో నీకు ఏది ఇష్టమైతే అదే చెయ్యి’ అంటూ బాలిక చివరిసారి మెసేజ్ చేసింది. 

ఆరోపణల్లో నిజం లేదు
బాలిక ఆత్మహత్యపై దర్యాప్తు జరిపి, నివేదిక అందించాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు గొండు సీతారాం అధికారులను ఆదేశించారు. కాగా, విద్యార్థిని ఆరోపణల్లో నిజం లేదని కళాశాల యాజమాన్యం వివరణ ఇచ్చింది. ఆమైపై లైంగిక వేధింపులు జరగలేదని, పాఠాలు అర్థం కావడం లేదని పలుమార్లు చెప్పిందని, ఆమె ఆత్మహత్యకు బహుశా అదే కారణం అయి ఉండొచ్చని పేర్కొంది. ఆమె చదివే తరగతిలో ఇద్దరు తప్పితే మిగతా అందరూ మహిళా సిబ్బందే బోధిస్తున్నారని పేర్కొంది. విద్యార్థిని ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితురాలి ఫోన్‌ను సీజ్ చేశారు. అందులోని డేటాతోపాటు కాలేజీలోని సీసీటీవీ ఫుటేజీలు సేకరించి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


More Telugu News