జూన్ 1న సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వకూడదు: ఎన్నికల సంఘం

  • ఏప్రిల్ 19 ఉదయం 7 నుంచి జూన్ 1న సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌‌ నిషిద్ధమనిహెచ్చరిక
  • పోలింగ్ ముగింపు సమయానికి 48 గంటల ముందు ఎలక్ట్రానిక్ మీడియాలో ఒపీనియన్ పోల్స్‌ ప్రచురించరాదని వెల్లడి
  • కీలక నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్నికల సంఘం
కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన విడుదల చేసింది. లోక్‌సభ ఎన్నికలు 2024లో ప్రారంభ దశ ఏప్రిల్ 19 ఉదయం 7 గంటల నుంచి ఏడవ దశ పోలింగ్ జరగాల్సిన జూన్ 1న సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడానికి వీల్లేదని సూచించింది. లోక్‌సభ, 4 రాష్ట్రాల అసెంబ్లీ, ఉపఎన్నికలకు ఓటింగ్ పూర్తయ్యే వరకు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం, ప్రచురించడం నిషిద్ధమని హెచ్చరిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం పోలింగ్ సమయంలో ఒపీనియన్ పోల్, పోల్ సర్వే ఫలితాలను ప్రచురించడం నిషిద్ధమని హెచ్చరించింది.

పోలింగ్ ముగింపు సమయానికి 48 గంటల ముందు ఎలక్ట్రానిక్ మీడియాలో ఎగ్జిట్ పోల్స్ ప్రచురించకూడదని గురువారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పోలింగ్ ముగిసిన అనంతరం మాత్రమే ఎగ్జిట్ పోల్స్‌ ప్రచురించుకోవడానికి వీలుంటుందని సూచించింది. కాగా లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా వేర్వేరు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు 12 రాష్ట్రాల్లోని 25 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి.


More Telugu News