సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ బండి సంజయ్ లేఖ

  • సిరిసిల్ల నేత కార్మికుల బకాయిలను వెంటనే విడుదల చేయాలన్న బండి సంజయ్
  • రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని సూచన
  • విద్యుత్ సబ్సిడీలను కొనసాగించాలని విజ్ఞప్తి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. సిరిసిల్ల నేత కార్మికుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని, విద్యుత్ సబ్సిడీలను కొనసాగించాలని కోరుతూ ఈ లేఖ రాశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం కారణంగా కొన్ని నెలలుగా యజమానులు, నేత కార్మికులు ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అందులో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పాత బకాయిలు రూ.270 కోట్లు రాలేదని... వాటిని ఇవ్వాలని కోరారు. వారంతా కొత్త ఆర్డర్లు లేక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు.

ఇక్కడ ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 వేల మంది వస్త్ర పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నట్లు చెప్పారు. తమను ఆదుకోవాలని కార్మికులు 27 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. బతుకమ్మ చీరల పేరుతో గత ప్రభుత్వం ఇక్కడి వ్యాపారులతో పాత వ్యాపారాలను మూయించిందని... ఆ తర్వాత వీరి పొట్ట కొట్టి పెద్ద యజమానులకు అప్పగించిందని ఆరోపించారు. దీంతో చిన్న వ్యాపారులు, కార్మికులు నష్టపోయారని వాపోయారు. వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు.

27 రోజులుగా ఆసాములు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారన్నారు. వారి డిమాండ్లను వెంటనే తీర్చాలని ఆ లేఖలో పేర్కొన్నారు. పవర్ లూం కార్ఖానాలకు సబ్సిడీని నిలిపివేశారని... ఆసాములు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారికి విద్యుత్ సబ్సిడీని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభం నుంచి బయటపడేందుకు అన్ని చర్యలు చేపట్టాలని కోరారు.


More Telugu News