పవన్ కల్యాణ్ ఓటమి ఖాయం.. మరో 30 ఏళ్లు జగనే సీఎం: ముద్రగడ

  • పవన్ కంటే చిరంజీవే బెటర్ అన్న ముద్రగడ
  • పవన్ తన ఇంటికి రావాలన్నా చంద్రబాబు అనుమతి కావాలని ఎద్దేవా
  • జగన్ ఆలోచనలు బాగుండబట్టే వైసీపీలో చేరానని వ్యాఖ్య
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఎన్నికలంటే సినిమాలు కాదని... ఆవేశంగా ప్రసంగాలు చేసినంత మాత్రాన ఓట్లు పడవని అన్నారు. రాజకీయాల్లో వపన్ కంటే చిరంజీవే బెటర్ అని చెప్పారు. పవన్ జైలుకెళ్లి చంద్రబాబును కలిసిన తర్వాతే ఆయన గ్రాఫ్ పెరిగిందని తాను చెప్పానని... దీంతో చంద్రబాబు తనపై కోపం పెంచుకున్నారని అన్నారు. పవన్ తన ఇంటికి రావాలన్నా చంద్రబాబు అనుమతి కావాలని చెప్పారు. 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ఏపీకి ప్రత్యేకహోదా తదితర అంశాలపై బీజేపీలో చేరేందుకు తాను సిద్ధమని ఆ పార్టీ నేతలకు తాను చెప్పానని.. అయితే వారి నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో తాను వైసీపీలో చేరానని తెలిపారు. జగన్ ఆలోచనలు బాగుండబట్టే తాను వైసీపీలో చేరానని చెప్పారు. బలమైన అభ్యర్థులకే జగన్ టికెట్లు ఇచ్చారని తెలిపారు. మరో 30 ఏళ్లు జగనే అధికారంలో ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. ఇకపై కాపు రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి ఉద్యమాలు చేయబోనని స్పష్టం చేశారు.  


More Telugu News