టీడీపీ తాజా జాబితాలోనూ రఘురామకు నో ప్లేస్!

  • ఇవాళ నలుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ
  • విజయనగరం లోక్ సభ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడుకు అవకాశం
  • రఘురామ ఆశలకు తెరపడిన వైనం
  • పొత్తులో భాగంగా నరసాపురం లోక్ సభ స్థానం బీజేపీకి కేటాయింపు
  • ఇప్పటికే తన అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ 
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసినప్పటికీ, ఏ పార్టీలోనూ చేరకుండా ఉన్న ఆయన మూడు పార్టీల కూటమిలో ఏదో ఒక పార్టీ ఎంపీగా అవకాశం ఇస్తుందని ఆశించారు. కానీ, ఇవాళ టీడీపీ విడుదల చేసిన తుది జాబితాతో ఆయన ఆశలకు తెరపడింది. 

ఈసారి ఎన్నికల్లో 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్న టీడీపీ మార్చి 22న విడుదల చేసిన జాబితాలో 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. నేడు విడుదల చేసిన జాబితాలో మిగిలిన నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. 

నరసాపురం టికెట్ ను పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించగా, బీజేపీ నరసాపురం లోక్ సభ అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాసవర్మను ప్రకటించింది. దాంతో, రఘురామ కనీసం విజయనగరం లోక్ సభ స్థానం నుంచి టీడీపీ అయినా అవకాశం ఇస్తుందేమోనని వేచి చూశారు. ఇవాళ టీడీపీ విడుదల చేసిన జాబితాలో విజయనగరం లోక్ సభ స్థానం అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు పేరు ప్రకటించారు. 

ఇప్పటికే రఘురామ నరసాపురం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని దాదాపుగా నిశ్చయించుకున్నారు. సిట్టింగ్ ఎంపీగా తనకు ఆ హక్కు ఉంటుందని ఆయన చెబుతున్నారు. ఒకవేళ మూడు పార్టీల కూటమిలో ఏ పార్టీ అయినా ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులు జరిపి రఘురామకు టికెట్ ఇచ్చే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం.


More Telugu News