యూపీలో దారుణం.. ప్ర‌యాణికుడి ప‌ట్ల అమానుషంగా ప్ర‌వ‌ర్తించిన ఆర్‌టీసీ బ‌స్సు డ్రైవ‌ర్‌, కండ‌క్ట‌ర్‌..!

  • ఆర్‌టీసీ బ‌స్సులో సీటు విష‌యమై జ‌రిగిన గొడ‌వ‌
  • ప్ర‌యాణికుడి చేతి వేలితో పాటు చెవిని కోరికేసిన‌ బ‌స్సు డ్రైవ‌ర్‌, కండ‌క్ట‌ర్
  • బాధితుడి నుంచి బంగారు గొలుసుతో పాటు రూ. 19,600 లాక్కున్న వైనం
  • గురువారం యూపీఎస్ఆర్‌టీసీ బ‌స్సులో ఘ‌ట‌న‌  
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆర్‌టీసీ బ‌స్సులో సీటు విష‌యమై జ‌రిగిన గొడ‌వ‌లో ప్ర‌యాణికుడి ప‌ట్ల‌ బ‌స్సు డ్రైవ‌ర్‌, కండ‌క్ట‌ర్ అమానుషంగా ప్ర‌వ‌ర్తించారు. ఈ ఘ‌ర్ష‌ణ‌లో ప్ర‌యాణికుడి చెవి, చేతి వేలిని కోరికేశారు. బాధితుడు కుల్దీప్ కుమార్‌ది సీతాపూర్ ప‌రిధిలోని సిధౌలీ. ఈ ఘ‌ట‌న‌లో త‌న ఎడ‌మచేతి చిటికెన వేలిలో కొంత భాగం, చెవిలో కొంత‌మేర కోల్పోయిన‌ట్లు తెలిపాడు. అలాగే మెడ‌లో ఉన్న బంగారు గొలుసుతో పాటు త‌న వ‌ద్ద ఉన్న‌ రూ. 19,600 కూడా పోయాయ‌ని బాధితుడు వాపోయాడు.    

కుల్దీప్ కుమార్ మాట్లాడుతూ.. "గురువారం నేను కైస‌ర్‌బాగ్ బ‌స్ స్టేష‌న్ నుంచి బిస్వాన్ వెళ్తున్న ఆర్‌టీసీ బ‌స్సు (యూపీ 34-టీ9813) లో సీతాపూర్ వ‌ద్ద ఎక్కాను. బ‌స్సులోప‌ల ఖాళీగా ఉన్న ఒక సీటుపై వెళ్లి కూర్చున్నాను. దాంతో వెంట‌నే నా ద‌గ్గ‌రికి వ‌చ్చిన కండ‌క్ట‌ర్ వేరే సీటులో కూర్చోవాల‌ని అన్నాడు. ఎందుక‌ని అడిగినందుకు బ‌స్ దిగిపోవాల‌ని బెదిరించాడు. ఆ త‌ర్వాత డ్రైవ‌ర్‌తో పాటు అందులో ఉన్న మ‌రికొంద‌రు నాపై దాడికి దిగారు. ఆ స‌మ‌యంలో నా కుడి చేతి చిటికెన వేలిని కోరికారు. అంత‌టితో ఆగ‌కుండా నా చెవిని కూడా కోరికేశారు. ఆ త‌ర్వాత నా మెడ‌లో ఉన్న బంగారం గొలుసు, నా వ‌ద్ద ఉన్న రూ. 19,600 న‌గ‌దు లాక్కున్నారు" అని చెప్పుకొచ్చాడు. 

అయితే, కుల్దీప్ కుమార్ ఎలాగోలా వారి నుంచి త‌ప్పించుకుని ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. ఆ త‌ర్వాత పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులు శ‌ర‌ణ్ మిశ్రా (డ్రైవ‌ర్‌), మ‌హ్మ‌ద్ రిజ్వాన్ (కండ‌క్ట‌ర్) అదుపులోకి తీసుకున్నారు. నిందితులిద్ద‌రినీ అరెస్ట్ చేసి విచారిస్తున్న‌ట్లు వాఝీర్‌గంజ్ పోలీస్ అధికారి దినేష్ మిశ్రా వెల్ల‌డించారు. అలాగే యూపీఎస్ఆర్‌టీసీ కూడా ఈ ఘ‌ట‌న‌కు బాధ్యుల‌యిన ఇద్ద‌రికి నోటీసులు ఇచ్చింది.


More Telugu News