ఆర్థిక రంగం ఇబ్బందుల్లో ఉన్నా బీజేపీ ‘డాక్టర్లకు’ పట్టట్లేదు: పి.చిదంబరం

  • విదేశీ పెట్టుబడుల్లో 31 శాతం కోత ఇందుకు నిదర్శనమన్న మాజీ ఆర్థిక మంత్రి
  • ప్రభుత్వ తప్పుడు విధానాలను విదేశీ మదుపర్లు గుర్తించారని వెల్లడి
  • దేశీ మదుపర్లకూ ప్రభుత్వంపై నమ్మకం తగ్గిందని వ్యాఖ్య
భారత ఆర్థికరంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా బీజేపీ వాళ్లకు పట్టట్లేదని మాజీ అర్థికశాఖ మంత్రి పి.చిదంబరం మండిపడ్డారు. 2023-24  సంవత్సరంలో భారత ఆర్థికరంగం గొప్పగా ఉందన్న నరేంద్ర మోదీ వ్యాఖ్యలను ఆయన ట్విట్టర్ వేదికగా ఖండించారు. విదేశీ పెట్టుబడుల్లో 31 శాతం కోత పడ్డ విషయాన్ని ప్రస్తావించారు. భారత ఆర్థికవ్యవస్థ, ప్రభుత్వ పాలసీలపై తగ్గుతున్న నమ్మకానికి ఇది కొలమానమని వ్యాఖ్యానించారు.   

‘‘వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి, వాస్తవ వేతనాల్లో పెరుగుదల జాడే లేదు. నిరుద్యోగిత పెరుగుతోంది. కుటుంబాల్లో వినియోగం తగ్గుతోంది. ఆర్థిక రంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉందనేందుకు ఇవన్నీ సంకేతాలే. కానీ బీజేపీ ‘డాక్టర్లు’ మాత్రం ఈ విషయాలను పట్టించుకోరు’’ అని ఆయన అన్నారు. 

దేశీ మదుపర్లకు కూడా ప్రభుత్వ విధానాలపై నమ్మకం తగ్గిందని అన్నారు. ఫలితంగా పెట్టుబుడులు తగ్గి నిర్మలా సీతారామన్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. అయినా, ఫలితం లేకపోవడంతో పెట్టుబడులు పెంచాలంటూ వారికి విజ్ఞప్తులు చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు పాలసీలు, ఆర్థిక రంగ అసమర్థ నిర్వహణను విదేశీ మదుపర్లు గుర్తించి పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారని అన్నారు. 

త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుతం రాజకీయ ఆర్థికరంగం చుట్టూ తిరుగుతోంది. తమ హయాంలో దేశ ఆర్థికరంగం దూసుకుపోయిందని బీజేపీ ప్రచారం చేసుకుంటుంటే అదంతా బూటకమంటూ కాంగ్రెస్ కొట్టిపారేసే ప్రయత్నం చేస్తోంది.


More Telugu News