కేజ్రీవాల్ అరెస్ట్ పై అమెరికా వ్యాఖ్యలు... మరోసారి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్

  • లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ అరెస్ట్
  • పారదర్శక విచారణ జరగాలన్న అమెరికా
  • బయటి శక్తుల ప్రమేయాన్ని అంగీకరించబోమన్న భారత్ 
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అరెస్ట్ చేయడం తెలిసిందే. ఈ కేసులో మనీ లాండరింగ్ అభియోగాలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. అయితే, కేజ్రీవాల్ అరెస్ట్ పై అగ్రరాజ్యం అమెరికా ఇటీవల స్పందిస్తూ, ఈ వ్యవహారంలో పారదర్శక విచారణను ప్రోత్సహిస్తామని పేర్కొంది. కేజ్రీవాల్ అరెస్ట్ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. 

అయితే, ఇప్పటికే ఓసారి అమెరికా వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్ మరోసారి స్పందించింది. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ... భారత్ ఒక బలమైన ప్రజాస్వామ్య దేశం అని, స్వతంత్ర, దృఢమైన ప్రజాస్వామిక సంస్థల విషయంలో భారత్ గర్విస్తోందని తెలిపారు. సదరు సంస్థలను బాహ్య శక్తుల ప్రభావం నుంచి సంరక్షించుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. 

భారతదేశ చట్టపరమైన ప్రక్రియలు, ఎన్నికల్లో  బయటి శక్తుల జోక్యం ఎంతమాత్రం ఆమోదయోగ్యంకాదు అని జైస్వాల్ స్పష్టం చేశారు. అమెరికాకు ఈ అంశంపై ఇప్పటికే తీవ్ర నిరసనను వ్యక్తపరిచామని వివరించారు.


More Telugu News