రియాన్ పరాగ్ కిర్రాక్ కొట్టుడు... రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు

  • ఐపీఎల్ లో నేడు రాజస్థాన్ రాయల్స్ × ఢిల్లీ క్యాపిటల్స్
  • టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్
  • 20 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు
  • 45 బంతుల్లో 84 పరుగులు చేసిన రియాన్ పరాగ్
  • 7 ఫోర్లు, 6 సిక్సర్లతో బీభత్సం
యువ ఆటగాడు రియాన్ పరాగ్ చెలరేగడంతో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరు చేసింది. ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు చేసింది. 

రాజస్థాన్ ఇన్నింగ్స్ లో రియాన్ పరాగ్ ఆటే హైలైట్. ఓ దశలో రాజస్థాన్ 150 పరుగులు చేయడమే గొప్ప అనుకుంటే, ఆఖర్లో రియాన్ పరాగ్ విజృంభణతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. 

ఆన్రిచ్ నోక్యా విసిరిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో పరాగ్ కొట్టుడు పతాకస్థాయికి చేరింది. ఆ ఓవర్లో పరాగ్ 3 ఫోర్లు, 2 సిక్సులు బాదడం విశేషం. దాంతో ఆ ఓవర్లో రాజస్థాన్ జట్టుకు ఏకంగా 25 పరుగులు లభించాయి. మొత్తమ్మీద 45 బంతులు ఎదుర్కొన్న పరాగ్ 7 ఫోర్లు, 6 సిక్సులతో 84 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

ఇక రవిచంద్రన్ అశ్విన్ కూడా తన బ్యాట్ ఝళిపించాడు. అశ్విన్ 19 బంతుల్లో 3 సిక్సర్లతో 29 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ 12 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు సాధించాడు. హెట్మెయర్ 1 సిక్స్, 1 ఫోర్ కొట్టి 14 పరుగులతో అజేయంగా నిలిచాడు. 

అంతకుముందు, ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (5), జోస్ బట్లర్ (11) విఫలమయ్యారు. కెప్టెన్ సంజు శాంసన్ (15) కూడా అదే బాటలో నడిచాడు. అయితే, రియాన్ పరాగ్ అదిరిపోయే పెర్ఫార్మెన్స్ తో ఇన్నింగ్స్ స్వరూపాన్ని మార్చివేశాడు. 

ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 1, ముఖేశ్ కుమార్ 1, ఆన్రిచ్ నోక్యా 1, అక్షర్ పటేల్ 1, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీశారు.


More Telugu News