అనపర్తి టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి చంద్రబాబు ఫోన్!

  • అనపర్తి టికెట్ బీజేపీకి కేటాయింపు
  • తీవ్ర మనస్తాపం చెందిన రామకృష్ణారెడ్డి
  • చంద్రబాబు సర్దిచెప్పే ప్రయత్నం చేశారని నల్లమిల్లి వెల్లడి
  • కార్యకర్తల ఆవేదనను ఆయనకు వివరించానని స్పష్టీకరణ
అనపర్తి టికెట్ వ్యవహారం అసంతృప్తి జ్వాలలకు కారణమైంది. అనపర్తి అసెంబ్లీ స్థానం పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్లింది. దాంతో, అనపర్తి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆయన మద్దతుదారులు ఆందోళనకు దిగారు. టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలను తమ ఆగ్రహానికి ఆహుతి చేశారు. తనకు టికెట్ దక్కకపోవడంపై కార్యకర్తలతో మాట్లాడి కార్యాచరణ ప్రకటిస్తానని నల్లమిల్లి వెల్లడించారు. 

ఈ నేపథ్యంలో, ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నేడు తనకు ఫోన్ చేశారని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వెల్లడించారు. చంద్రబాబు పరిస్థితులను వివరించే ప్రయత్నం చేశారని, కానీ తాను నిర్మొహమాటంగా నియోజకవర్గ పరిస్థితిని, కార్యకర్తల ఆవేదనను ఆయనకు వివరించానని తెలిపారు. 

"పార్టీ కోసం ప్రాణాలొడ్డి మరీ పోరాడిన నన్ను ఇవాళ బలి చేశారు. మీకోసం తెగించి పోరాడిన కొద్దిమందిలో నేనూ ఒకడిని. ఆనాడు వైఎస్సార్ పిలిచినా మా కుటుంబం మీ వెంటే నడిచింది. గత 40 ఏళ్లుగా మా కుటుంబం పోరాడిన తీరును, ఇక్కడి శ్రేణులు పోరాటాలను మరిచారా?" అంటూ చంద్రబాబుకు వివరించానని నల్లమిల్లి ట్వీట్ చేశారు. 

అంతేకాదు, అనపర్తిలో టీడీపీ ఉనికినే ప్రమాదంలో పడేశారని, ఇప్పుడు కాపాడుకోవాల్సింది మీరేనని చంద్రబాబుకు స్పష్టంగా చెప్పానని వెల్లడించారు.


More Telugu News