బీజేపీ నేత బండి సంజయ్‌పై మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

  • విధి నిర్వహణలో ఉన్న తనపై దాడి చేశారని నాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదు
  • బండి సంజయ్‌తో పాటు మరికొందరిపై కేసు నమోదు
  • ఓ వర్గం దాడిలో గాయపడిన గిరిజన మహిళలను పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో ఘటన
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. విధి నిర్వహణలో ఉన్న తనపై దాడి చేశారని నాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు చేశారు. బండి సంజయ్‌తో పాటు ఘట్‌కేసర్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, మరికొందరిపై కేసు నమోదయింది. ఓ వర్గం దాడిలో గాయపడిన మహిళలను పరామర్శించేందుకు బండి సంజయ్ నిన్న చెంగిచెర్లలోని పిట్టలబస్తీకి వెళ్లారు.

బండి సంజయ్ అక్కడకు రావడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక్కడకు రావడానికి అనుమతి లేదని పోలీసులు చెప్పారు. ఎవరినీ లోపలికి అనుమతించకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. అక్కడకు చేరుకున్న బండి సంజయ్, కార్యకర్తలు బారికేడ్లను తోసుకొని లోపలికి వెళ్లారు. ఘటనలో గాయపడిన మహిళలను పరామర్శించారు. వారికి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.

మహిళలపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీసులు, కబేళా నిర్వాహకులు కక్షతో పేద గిరిజన మహిళలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. బస్తీకి వచ్చి మరీ మహిళలు, పిల్లలపై దాడులు చేశారని, ఇందుకు కారకులైన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో తన విధులకు ఆటంకం కలిగించారని, తనపై దాడి చేశారని నాచారం సీఐ ఫిర్యాదు చేశారు.


More Telugu News