ఆయనతో సినిమా రాసిపెట్టి లేదంతే: నటి భానుప్రియ

  • 1980లలో ఒక వెలుగు వెలిగిన భానుప్రియ 
  • సంప్రదాయ నృత్యంలో సందడి చేసిన హీరోయిన్ 
  • కె.విశ్వనాథ్ అభినందించేవారని వెల్లడి 
  • అప్పట్లో వెంకటేశ్ ఎక్కువగా మాట్లాడేవారు కాదని వ్యాఖ్య

చారడేసి కళ్లు .. కోలాటమాడే కనురెప్పలు అనగానే భానుప్రియ టక్కున గుర్తుకువస్తారు. వెండితెరపై ఆమె కళ్లు చేసిన కవాతు .. చూపులు చేసిన విన్యాసాలను మరిచిపోయిన ప్రేక్షకులు లేరు. 1980లలో ఒక వెలుగు వెలిగిన భానుప్రియ, ప్రస్తుతం తన స్థాయికి తగిన కేరక్టర్ రోల్స్ చేస్తూ వెళుతున్నారు. ఐడ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించారు.

"బాపు గారు అంటే నాకు చాలా ఇష్టం .. తన సినిమాల్లో ఆయన హీరోయిన్ ను చూపించే స్టైల్ నాకు బాగా నచ్చుతుంది. హీరోయిన్ కళ్లకు ఆయన ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. అందువలన ఆయన నుంచి నాకు పిలుపు వస్తుందని నేను ఎదురు చూశాను. కానీ ఆయన నుంచి నాకు అవకాశం రాలేదు. ఆయనను నేను కలవలేకపోయాను కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనతో సినిమా రాసిపెట్టి లేదంతే" అని అన్నారు. 

"ఇక విశ్వనాథ్ గారి విషయానికి వస్తే .. షూటింగులో బాగా చేస్తే 'చాలా బాగా వచ్చింది' అని భుజం తట్టి అభినందించేవారు. వెంకటేశ్ గారు డాన్స్ విషయంలో మా అత్తమ్మ దగ్గర స్టూడెంట్. అప్పట్లో ఆయన ఎక్కువగా మాట్లాడేవారు కాదు .. చాలా రిజర్వ్డ్ గా ఉండేవారు. తెరపై మా కాంబినేషన్ కి మంచి పేరు వచ్చింది" అని చెప్పారు.



More Telugu News