తాజ్‌ మహల్‌పై యూపీ కోర్టులో మ‌రో పిటిషన్‌

  • తాజ్‌ మహల్‌ను హిందూ దేవాలయం తేజో మహాలయగా ప్రకటించాలని పిటిషన్‌
  • తాజ్‌ మహల్‌లో నిర్వ‌హిస్తున్న‌ అన్ని ఇస్లామిక్ కార్యకలాపాలను నిలిపివేయాలని కోరిన పిటిష‌న‌ర్‌ అజయ్ ప్రతాప్ సింగ్
  • ఏప్రిల్ 9న ఆగ్రా కోర్టులో విచారణ‌కు రానున్న పిటిషన్‌
తాజ్‌ మహల్‌ను శివాల‌యంగా ప్రకటించాలని ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ కోర్టులో మ‌రో కొత్త‌ పిటిషన్ దాఖ‌లైంది. తాజ్‌ మహల్‌ను హిందూ దేవాలయం తేజో మహాలయగా ప్రకటించాలని కోరుతూ యూపీలోని ఆగ్రా కోర్టులో తాజాగా పిటిషన్ దాఖలైంది. బుధవారం దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో ప్ర‌స్తుతం తాజ్‌ మహల్‌లో నిర్వ‌హిస్తున్న‌ అన్ని ఇస్లామిక్ కార్యకలాపాలను వెంట‌నే నిలిపివేయాలని పిటిషనర్ కోర‌డం జ‌రిగింది. కాగా, ఈ పిటిష‌న్‌ను ఆగ్రా కోర్టు ఏప్రిల్ 9న విచారించనుంది. 

యోగేశ్వర్ శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ ట్రస్ట్, క్షత్రియ శక్తిపీఠ్ వికాస్ ట్రస్ట్ అధ్యక్షుడిగా ఉన్న‌ న్యాయవాది అజయ్ ప్రతాప్ సింగ్ ఈ దావా వేశారు. తాజ్‌ మహల్‌గా గుర్తించబడక ముందే ఈ నిర్మాణానికి చరిత్ర ఉందంటూ పిటిషనర్ తన వాదనల‌కు బ‌లం చేకూర్చేలా వివిధ చారిత్రక పుస్తకాలను ఈ సంద‌ర్భంగా ఉదహరించారు. ఇదిలాఉంటే.. తాజ్‌ మహల్‌ను శివాలయంగా ప్రకటించాలని కోరుతూ ఇప్ప‌టికే పలుమార్లు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో కొన్ని పిటిషన్లు కొట్టివేయగా, మరికొన్ని పెండింగ్‌లో ఉన్నాయి.


More Telugu News