మాల్దీవుల్లో డాలీ చాయ్‌వాలా.. క్రేజ్ మామూలుగా లేదుగా!

  • విభిన్నంగా చాయ్‌చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయిన డాలీ చాయ్‌వాలా
  • డాలీ చాయ్‌వాలాను కలిసి టీ తాగిన బిల్‌గేట్స్
  • ఇప్పుడు మాల్దీవుల్లో వాలిపోయిన డాలీ చాయ్‌వాలా
  • ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడిన స్థానికులు
  • డాలీ చాయ్‌వాలా విజయానికి సోషల్ మీడియా అభినందనలు
విభిన్నంగా చాయ్ చేస్తూ సోషల్ మీడియాకెక్కి క్రేజ్ సొంతం చేసుకున్న నాగ్‌పూర్‌కు చెందిన డాలీ చాయ్‌వాలా క్రేజ్ దేశ సరిహద్దులు దాటేసింది. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌కు చాయ్ అందించి ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించిన డాలీ చాయ్‌వాలా ప్రస్తుతం మాల్దీవుల్లో సందడి చేస్తున్నాడు. అక్కడ కూడా అతడికి ఫాలోయింగ్ భారీగా ఉందన్న విషయం అతడి తాజా పోస్టులో వెల్లడైంది. స్థానికులు అతడితో ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు.  ఇప్పుడీ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు అయితే కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. డాలీ విజయానికి అందరూ అభినందనలు చెబుతూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

బిల్‌గేట్స్ పోస్టుతో ప్రపంచం దృష్టికి
ఇటీవల భారత పర్యటనకు వచ్చిన బిల్‌గేట్స్.. డాలీ చాయ్‌వాలను కలిసి టీ తాగడం ఇంటర్నెట్‌లో సంచలనమైంది. డాలీ టీ స్టాల్‌లో రీఫ్రెష్‌మెంట్ కోసం కప్పు చాయ్‌ను ఆస్వాదించడానికి కొంత సమయం తీసుకున్నట్టు బిల్‌గేట్స్ చేసిన పోస్ట్ వైరల్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఇది ఆకర్షించింది. అప్పటి వరకు సోషల్ మీడియాకే పరిమితమైన డాలీ చాయ్‌వాలా ఆ తర్వాత దినపత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కి ఫేమస్ అయిపోయాడు. తాజాగా ఇప్పుడు మాల్దీవుల పర్యటనకు వెళ్లిన డాలీ చాయ్‌వాలాకు విమానంలో చక్కని ఆహ్వానం లభించింది. ప్రయాణికులు, ఎయిర్‌హోస్టెస్‌లు అతడితో కలిసి సెల్ఫీలు తీసుకున్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. 

మాల్దీవులకు మళ్లీ మంచి రోజులు!
భారత్‌పై మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు నోరు పారసుకున్న తర్వాత భారత పర్యాటకులు మాల్దీవుల పర్యటనను బాయ్‌కాట్ చేశారు. పర్యాటకంపైనే ఆధారపడే మాల్దీవులు భారత్ దెబ్బకు విలవిల్లాడింది. భారత్‌తో తిరిగి సయోధ్య కోసం దిగొచ్చింది. భారత్‌ను సన్నిహిత మిత్రుడిగా అభివర్ణించిన ముయిజ్జు.. తమ దేశానికి రుణ విముక్తి కల్పించాలని భారత్‌ను కోరారు. ఇప్పుడు డాలీ చాయ్‌వాలా మాల్దీవుల్లో వాలిపోవడంతో మన పర్యాటకులు మళ్లీ మాల్దీవుల్లో వాలిపోతారేమో చూడాలి.


More Telugu News