చిరంజీవి, మోహన్‌బాబు వివాదంపై స్పందించిన మంచు మనోజ్

  • రాంచరణ్ బర్త్ డే వేడుకలు నిర్వహించిన మనోజ్
  • హాజరైన నిఖిల్, కిరణ్ అబ్బవరం, దర్శకులు బుచ్చిబాబు, బాబీ 
  • రాంచరణ్ తనకు ప్రాణ స్నేహితుడన్న మనోజ్
  • అతడు గొప్ప నటుడు మాత్రమే కాదని, మంచి మనసున్న వ్యక్తి కూడా అంటూ ఉదాహరణ చెప్పిన మనోజ్
  • చిరంజీవి, మోహన్‌బాబు టామ్ అండ్ జెర్రీలాంటి వారన్న నటుడు
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి, మోహన్‌బాబు ఎవరికి వారే ప్రత్యేకమైనవారు. ఇద్దరిదీ సుదీర్ఘ సినీ ప్రయాణం. వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని, గొడవలు పడుతుంటారన్న వార్తలు కూడా ఉన్నాయి. పలుమార్లు బాహాటంగానే ఈ విషయం వెల్లడైంది కూడా. అయితే, ఆ తర్వాత ఇద్దరూ మళ్లీ స్టేజీపై కనిపించడం, అందరూ అనుకుంటున్నట్టు తమ మధ్య విభేదాలేవీ లేవని చెప్పడం పరిపాటిగా మారింది. ఇదే విషయమై మోహన్‌బాబు తనయుడు మంచు మనోజ్ మరోమారు స్పష్టతనిచ్చారు. చిరంజీవి, మోహన్‌బాబు టామ్ అండ్ జెర్రీ లాంటి వారని, గొడవ పడుతూ కలిసిపోతుంటారని చెప్పారు. వారిద్దరిదీ 45 ఏళ్ల బంధమని పేర్కొన్నారు. 

రాంచరణ్ బర్త్ డే వేడుకలు
రాంచరణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని నిన్న హైదరాబాద్‌లో వేడుకలు నిర్వహించారు. దీనికి మనోజ్, నిఖిల్, కిరణ్ అబ్బవరం, దర్శకులు బుచ్చిబాబు, బాబీతోపాటు అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ.. రాంచరణ్ తనకు ప్రాణ స్నేహితుడని అన్నారు. చరణ్ మంచి నటుడు మాత్రమే కాదని, అంతకుమించిన గొప్ప మనసున్న వ్యక్తి అని కొనియాడారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చలించిపోతారని చెబుతూ ఓ విషయం గురించి వెల్లడించారు. దుబాయ్‌లో ఉంటున్న తెలుగు కుటుంబం సమస్యల్లో ఉందని తెలిసిందని, అప్పుడు తాను అమెరికాలో ఉన్నానని మనోజ్ చెప్పారు. అప్పట్లో తన ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో ఆ విషయాన్ని రాంచరణ్‌కు ఫోన్ చేసి చెప్పానని గుర్తు చేసుకున్నారు. ఆ కుటుంబానికి తనవంతుగా సాయం చేశానని, ఇంకా రూ. 5 లక్షల తక్కువయ్యాయని చెప్పగానే మరేమీ మాట్లాడకుండా బ్యాంకు వివరాలను పంపమని అడిగాడని, వివరాలు చెప్పగానే వెంటనే డబ్బులు పంపాడని గుర్తుచేసుకున్నారు. ఆ కుటుంబం ఆశీస్సులు చరణ్‌కు ఎప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు. చెర్రీ స్నేహానికి విలువనిస్తాడని, బాల్య మిత్రులతో ఇప్పటికీ కాంటాక్ట్‌లో ఉంటాడని చెప్పుకొచ్చారు.

వాళ్లిద్దరూ టామ్ అండ్ జెర్రీలాంటి వారు
ఓసారి తనతో ఓ వ్యక్తి మాట్లాడుతూ. ‘మీ నాన్న, చెర్రీ నాన్న గొడవ పడుతుంటారు, కలిసిపోతుంటారు కదా.. మీ ఇద్దరూ ఇంతకాలంగా ఎలా స్నేహితులుగా ఉండగలిగారు?’ అని అడిగాడరని, దానికి తాను.. భార్యాభర్తల విషయాల్లో కలగజేసుకునే వ్యక్తిని ఏమంటారో తెలుసా? అని ప్రశ్నించానని చెప్పారు. వాళ్లిద్దరూ టామ్ అండ్ జెర్రీలాంటివారని, గొడవ పడుతుంటారు, కలిసిపోతుంటారని, ఇద్దరిదీ 45 ఏళ్ల బంధమని, తమలాగే వాళ్లిద్దరూ ఎప్పటికీ కలిసి ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

మెగా, మంచు ఫ్యామిలీ షుడ్ బీ లైక్..
చెర్రీ బర్త్‌డే వేడుకల్లో మనోజ్ ‘పెదరాయుడు’ సినిమాలోని డైలాగ్‌ను రీక్రియేట్ చేసి అభిమానులను అలరించారు. ‘ ఎ రిలేషన్ బిట్వీన్ మెగా ఫ్యామిలీ అండ్ మంచు ఫ్యామిలీ షుడ్‌బీ లైక్ ఎ ఫిష్ అండ్ వాటర్. బట్ షుడ్‌నాట్ బీ లైక్ ఎ ఫిష్ అండ్ ఫిషర్‌మ్యాన్’ అని చెప్పడంతో అభిమానులు చప్పట్లతో తమ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.


More Telugu News